నేరేడుచర్ల, సెప్టెంబర్ 8, శుభోదయ డైనమిక్ న్యూస్
నేరేడుచర్ల పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో చైర్మన్ కొనతం వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులు విస్తృతంగా చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రూ.18.75 లక్షల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం మొత్తం 17 తీర్మానాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పట్టణ పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేయడానికి నిధులు వినియోగించాలని నిర్ణయించారు.
పారిశుద్ధ్యం, పైప్‌లైన్ పనులకు రూ.5 లక్షలు
మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు నుంచి 15వ వార్డు వరకు పారిశుద్ధ్య పనులు, తాగునీటి పైప్‌లైన్ మరమ్మతులు, వన మహోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన పనుల కోసం JCBలను కిరాయి పద్ధతిలో వినియోగించేందుకు రూ.5 లక్షలు కేటాయించేందుకు తీర్మానం చేశారు.
తాగునీటి మోటార్ల మరమ్మతులకు రూ.3 లక్షలు
పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వాటర్ సప్లై మోటార్ల మరమ్మతులు, చైన్ బ్లాకుల కొనుగోలు కోసం రూ.3 లక్షలు కేటాయించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.12వ వార్డులో బైరెడ్డి ప్రతాప్‌రెడ్డి ఇంటి సమీపంలో డ్రైనేజీ కల్వర్టు నిర్మాణానికి రూ.50 వేల నిధులు కేటాయిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
పారిశుద్ధ్య పనులకు రోజువారీ కూలీలు
పట్టణ పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు రోజువారీ కూలీల వేతనాల కోసం రూ.4 లక్షలు కేటాయించేందుకు కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
వీధి కుక్కల నియంత్రణకు ABC కార్యక్రమం
పట్టణంలో వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కార్యక్రమం చేపట్టాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 300 వీధి కుక్కలకు హైదరాబాద్‌కు చెందిన AWS సంస్థ ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు తీర్మానం చేశారు.
ఘన వ్యర్థాల నిర్వహణ సంస్థకు బిల్లు మంజూరు
SWM Rules–2026 ప్రకారం తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్టింగ్ ప్రక్రియ చేపడుతున్న M/s GOGREENINNOVATIONS సంస్థకు రూ.3,15,060 బిల్లు చెల్లించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
రంజాన్, బక్రీద్ ఏర్పాట్ల ఖర్చుకు ఆమోదం
రంజాన్, బక్రీద్ పండుగల సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ ఏర్పాట్లకు సంబంధించి చేసిన రూ.30 వేల ఖర్చుకు కూడా కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న వారు
సమావేశంలో వైస్ చైర్మన్ నూకల సందీప్‌రెడ్డి, కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, కౌన్సిలర్లు దొండపాటి అప్పిరెడ్డి, యారవ లక్ష్మి, కొనతం మంజుల, నన్నెపంగా శ్రీనివాస్, తాళ్ల లావణ్య, ఇంజమూరి శ్రీకాంత్, ఎం.డి. అబ్దుల్ కలీం, బొలిశెట్టి లక్ష్మయ్య, గుగులోతు రవీందర్ నాయక్, వాసా జ్యోతి, ఇంజమూరి వెంకటమ్మ, ఎం.డి. షాహిన్, ఆరూరి విజయలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు షేక్ ఖాజా ఖాన్, షేక్ మొగలాబి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
