సూర్యాపేట బ్యూరో, మే 17,శుభోదయ డైనమిక్ వార్త
శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచే లక్ష్యంతో సూర్యాపేట పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులు, చోరీకి గురైన వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
అనుమతి పత్రాలు లేని వాహనాల సీజ్
తనిఖీల సందర్భంగా పత్రాలు లేని, నెంబర్ ప్లేట్లు లేని సుమారు 65 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అలాగే ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా అనుమానితులను తనిఖీ చేయగా గతంలో నేరాలకు పాల్పడిన నలుగురిని గుర్తించినట్లు డిఎస్పి తెలిపారు. ప్రస్తుతం వారి వివరాలను పరిశీలిస్తూ విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డిఎస్పి ప్రసన్నకుమార్
ఈ సందర్భంగా డిఎస్పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పి నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రజలకు భద్రత కల్పించడం, సమాజంలో శాంతిభద్రతలు కాపాడడం కోసం ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.కాలనీలోకి అనుమానాస్పద వ్యక్తులు వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి సరైన ధృవీకరణ లేకుండా ఇండ్లు అద్దెకు ఇవ్వవద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు వాహన పత్రాలు కలిగి ఉండాలని, ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం
ప్రస్తుత సమాజంలో గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని డిఎస్పి ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయికి అలవాటు పడిన వారిని సత్ప్రవర్తన వైపు మళ్లించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి
పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ ప్రజలు పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణంలో జీవించాలని కోరారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని హెచ్చరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఏడుకొండలు, మహేందర్ నాథ్, శివతేజ, ఐలయ్య, బాలు నాయక్, సైదిరెడ్డి, కనకరత్నం, వెంకన్న, ఏఎస్ఐలు నరేందర్ రెడ్డి, ముత్తయ్య, వెంకన్నతో పాటు స్పెషల్ పార్టీ, పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

