శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే, మే 26
ప్రజలు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. మోతే పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపురం స్టేజి వద్ద జరిగిన కారు రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలి
ప్రమాదానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణ లోపాలు, పొదలు, అడ్డంకులు లేదా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే నివేదికలో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.
సీటు బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల అజాగ్రత్త కారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించాలని కోరారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే ప్రమాదాలు, మరణాలను తగ్గించవచ్చని తెలిపారు.
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు
పోలీస్ శాఖ తరచుగా రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ప్రమాదాల నివారణ కోసమే ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేపడుతున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
మోతే పోలీస్ స్టేషన్ పరిశీలన
అనంతరం మోతే పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వేగవంతమైన సేవలు అందించాలని, రహదారులపై నిఘా పెంచి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ అజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
