Friday, May 29, 2026
Homeతాజా సమాచారండయల్ 100 కాల్స్‌పై సూర్యాపేట పోలీసుల మెరుపు స్పందన సగటున 10 నిమిషాల్లో బాధితుల వద్దకు...

డయల్ 100 కాల్స్‌పై సూర్యాపేట పోలీసుల మెరుపు స్పందన సగటున 10 నిమిషాల్లో బాధితుల వద్దకు చేరుతున్న పోలీసు బృందాలు

సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త, మే 26

సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ డయల్ 100 ఫిర్యాదులపై వేగవంతంగా స్పందిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు డయల్ 100కు కాల్ చేసిన వెంటనే పోలీసులు నిమిషాల వ్యవధిలో ఘటనాస్థలానికి చేరుకుని అవసరమైన సహాయం అందిస్తున్నారు.

రికార్డు స్థాయిలో స్పందన

జిల్లా వ్యాప్తంగా సోమవారం వచ్చిన డయల్ 100 ఫిర్యాదులపై పోలీసు సిబ్బంది సగటున 10 నిమిషాల్లోనే స్పందించి బాధితుల వద్దకు చేరుకున్నారు. ఘటనాస్థలాల్లో తక్షణ చర్యలు చేపట్టి బాధితులకు అండగా నిలిచారు.

ప్రత్యేక బృందాలతో నిరంతర పర్యవేక్షణ

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజూ 3 నుంచి 5 ప్రత్యేక బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. బ్లూకోట్స్, పెట్రోకార్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అత్యవసర కాల్స్‌కు వేగంగా స్పందిస్తున్నారు.

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

డయల్ 100 సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బందికి నిరంతరం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంటి వద్ద నుంచే కేసుల నమోదు

“ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్” కార్యక్రమానికి ప్రజల ప్రశంసలు

బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సూర్యాపేట జిల్లా పోలీసులు బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్” కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.

మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సేవలు

మహిళలు, బాలలు, వృద్ధులపై దాడులు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, భౌతిక దాడులు, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసులు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, బాల్య వివాహాల వంటి ఘటనలపై సమాచారం అందిన వెంటనే బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. కేసు నమోదు అనంతరం సంబంధిత పత్రాలను కూడా బాధితులకు అందజేస్తున్నారు.

అత్యవసర సమయాల్లో డయల్ 100 వినియోగించాలి

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూర్యాపేట జిల్లా పోలీసులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments