నేరేడుచర్ల, మే 27,శుభోదయ డైనమిక్ వార్త
బూర్గుల తండా గ్రామంలో తుల్జా భవాని పండుగ సందర్భంగా అనుమతి లేకుండా భారీ శబ్దాలతో డీజే నిర్వహిస్తూ గ్రామంలో ర్యాలీ చేపట్టిన వారిపై నేరేడుచర్ల పోలీసులు చర్యలు చేపట్టారు.మంగళవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో పెద్ద శబ్దాలతో ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా డీజే వాహనం తిరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నేరేడుచర్ల ఎస్ఐ సైదిరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు.
డీజే వాహనం సీజ్.. కేసు నమోదు
పరిశీలనలో ఎటువంటి అధికార అనుమతి లేకుండా డీజే నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు డీజే వాహనాన్ని సీజ్ చేశారు. అలాగే డీజే ఆపరేటర్, యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా అధిక శబ్దాలతో డీజేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సైదిరెడ్డి హెచ్చరించారు.
