డైనమిక్, నేరేడుచర్ల, నవంబర్ 6
గీత వృత్తిలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన గీత పరివారాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.132 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని గీతపనివారల సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ కోటయ్య డిమాండ్ చేశారు.గురువారం నాడు నేరేడుచర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు గీత పనివారల సంఘం నేరేడుచర్ల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వానికి 132 కోట్లు పెద్ద మొత్తం కాదని, కానీ గీత పనివారల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం సరికాదని” అన్నారు.
ఎక్స్గ్రేషియా పెంపుతో పాటు సురక్షా కిట్లు అందించాలి
గీత వృత్తిలో మరణించిన వారికి ఎక్స్గ్రేషియా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని, గాయాలతో బయటపడ్డ వారికి కనీసం రూ.2 లక్షలు చెల్లించాలని కోటయ్య డిమాండ్ చేశారు.
అలాగే, మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేసి, సివిల్ సర్జన్ పర్యవేక్షణలో వికలాంగుల నిర్ధారణ పద్ధతిని గతంలా పున రుద్ధరించాలని కోరారు.అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని టిఎఫ్టీల సహకార సంఘాలకు తగిన నిధులు కేటాయించి, చెట్లు గీసే గీత కార్మికులందరికీ సంపూర్ణ సేఫ్టీ కిట్లు అందించాలన్నారు.
గీత వృత్తి పరికరాలకు స్థలం, వనరులు కేటాయించాలి
హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పాలకూరి బాబు మాట్లాడుతూ –
“రాష్ట్రంలోని అన్ని జిల్లాల గీత సహకార సంఘాలు, టిఎఫ్టీలకు శాశ్వత లైసెన్సులు ఇవ్వాలి. అర్హులైన వారికి గుర్తింపు కార్డులు, ఉచిత వృత్తి పరికరాలు, బైకులు లేదా మోపెడ్లు అందించాలి” అని తెలిపారు. అలాగే, గీత వృత్తి పరికరాలు, కల్లు దుకాణాల ఏర్పాటుకు గ్రామాల్లో 1,000 గజాలు, పట్టణాల్లో 2,000 గజాల స్థలాన్ని కేటాయించి, అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
ధర్నాలో పలువురు నాయకులు పాల్గొనారు
కార్యక్రమంలో గీతపనివారల సంఘం జిల్లా నాయకుడు సోమగాని రామన్న, గౌడ సంఘం జిల్లా ప్రతినిధి కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, మండల అధ్యక్షుడు కొండ రాము గౌడ్, గోపగాని మారయ్య గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, కొమర్రాజు వెంకట్, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
