Saturday, May 30, 2026
Homeతాజా సమాచారంవరి కొయ్యకాళ్లు కాల్చొద్దు.. నేల సారాన్ని కాపాడండి రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు

వరి కొయ్యకాళ్లు కాల్చొద్దు.. నేల సారాన్ని కాపాడండి రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు

నేరేడుచర్ల, మే 30,శుభోదయ డైనమిక్ వార్త

నేరేడుచర్ల మండలంలోని సోమవారం గ్రామంలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి కోత అనంతరం రైతులు వరి కొయ్యకాళ్లు, ఇతర పంట వ్యర్థాలను కాల్చివేయకుండా భూమిలో కలిపి సేంద్రియ పదార్థాలుగా మార్చుకోవాలని అధికారులు సూచించారు.

కొయ్యకాళ్లు కాల్చితే నేల సారం తగ్గుతుంది

పంట అవశేషాలను కాల్చివేయడం వల్ల నేలలోని కోట్లాది సూక్ష్మజీవులు, ఇతర జీవరాశులు నశించి భూమి సారవంతత కోల్పోతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. యూరియా, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులను మొక్కలకు అందుబాటులోకి తీసుకురావడంలో సూక్ష్మజీవుల పాత్ర కీలకమని, అవి నశిస్తే పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు.

సేంద్రియ పదార్థాలుగా వినియోగించాలి

వరి కొయ్యకాళ్లు, ఇతర పంట వ్యర్థాలు మంచి సేంద్రియ పదార్థాలని, వాటిని భూమిలో కలపడం ద్వారా సేంద్రీయ కర్బనం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. ప్యాడీ మల్చర్, రోటావేటర్ వంటి యంత్రాలతో కొయ్యకాళ్లను చిన్న ముక్కలుగా చేసి భూమిలో కలపాలని సూచించారు.

సాగు ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయి

సూపర్ ఫాస్ఫేట్, పశువుల మూత్రం లేదా వేస్ట్ డికంపోజర్‌ను ఉపయోగించి పంట అవశేషాలను భూమిలో కలిపితే యూరియా వినియోగం తగ్గడంతో పాటు భాస్వరం అవసరం కూడా తగ్గుతుందని తెలిపారు. నేలలో కర్బన శాతం పెరిగి సూక్ష్మ పోషకాలు మొక్కలకు అందడంతో పంటలు రోగనిరోధక శక్తిని పెంపొందించుకుని అధిక దిగుబడులు ఇస్తాయని పేర్కొన్నారు.

నేలతల్లిని కాపాడాలని పిలుపు

రైతులు పంట అవశేషాలను కాల్చివేయడం మానుకుని నేల సారాన్ని కాపాడాలని అధికారులు కోరారు. “కన్నతల్లి లాంటి నేలతల్లిని కాల్చవద్దు.. అప్పుడే అధిక దిగుబడులు, మంచి ఆదాయం సాధించగలరు” అని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మండల ఎంపీడీవో, వ్యవసాయ అధికారి షేక్ జావేద్, వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్మల, సంధ్య, సోమవారం గ్రామ సర్పంచ్ ఎస్‌కే రహీం, ఉప సర్పంచ్ ఆడపు గోపి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments