Sunday, June 7, 2026
Homeతాజా సమాచారంనేరేడుచర్ల మండలంలో యూరియా మాయమైందా?ఆన్లైన్‌లో స్టాక్ ‘నిల్’… అధికారుల మాటల్లో ‘సమృద్ధి’రైతుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్న వ్యవసాయ...

నేరేడుచర్ల మండలంలో యూరియా మాయమైందా?ఆన్లైన్‌లో స్టాక్ ‘నిల్’… అధికారుల మాటల్లో ‘సమృద్ధి’రైతుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్న వ్యవసాయ శాఖ వైఫల్యం

డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, జనవరి 31

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆన్లైన్ యూరియా బుకింగ్ విధానం నేరేడుచర్ల మండలంలో పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల వ్యాప్తంగా సుమారు 30కి పైగా ఫర్టిలైజర్ దుకాణాలు ఉన్నప్పటికీ, ఒక్క షాపులో కూడా ఆన్లైన్ వ్యవస్థలో యూరియా బస్తాల స్టాక్ కనిపించడం లేదు. అన్ని చోట్లా ‘నిల్’ అని మాత్రమే చూపిస్తోంది.

కలెక్టర్ మాటలు – క్షేత్రస్థాయి వాస్తవాలు వేర్వేరు

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాలు సమృద్ధిగా ఉన్నాయని ప్రకటనలు ఇస్తుంటే, మండలంలో మాత్రం రైతులకు ఒక్క బస్తా కూడా అందని పరిస్థితి నెలకొంది. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

80 శాతం రైతులు యూరియా తీసుకున్నారంటున్న అధికారులు

మండల వ్యవసాయ అధికారీ జావేద్ చెబుతున్న ప్రకారం ఇప్పటికే 80 శాతం మంది రైతులు యూరియా పొందారని పేర్కొంటున్నారు. అయితే అదే సమయంలో ఆన్లైన్‌లో స్టాక్ నిల్ గా చూపించడం రైతులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజంగా రైతులు తీసుకుంటే స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? అన్న ప్రశ్నకు సమాధానం లభించడం లేదు.

ఆన్లైన్ వ్యవస్థలో దళారీ హవా నడుస్తుందా?

రైతుల అనుమానం ప్రకారం ఆన్లైన్ విధానంలో కూడా దళారుల హస్తం ఉన్నట్లు కనిపిస్తోంది. కొందరు మధ్యవర్తులు బస్తాలను ముందుగానే బుక్ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని రైతులు అంటున్నారు.

డీలర్లు – వ్యవసాయ అధికారుల కుమ్మక్కా?

డీలర్లు, మండల వ్యవసాయ అధికారులు కుమ్మక్కై యూరియా బస్తాలను గుట్టుగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. స్టాక్ వివరాలను ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్‌లో అప్‌డేట్ చేయకపోవడమే ఇందుకు సంకేతమని రైతులు ఆరోపిస్తున్నారు.

రైతుల ఆగ్రహం

యూరియా లేకపోవడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో ఎరువులు అందక పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

తక్షణమే విచారణ జరపాలి

నేరేడుచర్ల మండలంలో యూరియా స్టాక్ మాయంపై జిల్లా స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉద్యమాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments