శుభోదయ డైనమిక్ డెస్క్, మే 23, హైదరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో వేద పాఠశాలకు భూమిపూజ నిర్వహించారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.43.79 కోట్లతో వేద పాఠశాల, రూ.9.86 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, రూ.1.34 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్లు నిర్మించనున్నారు. అదనంగా రూ.43.12 కోట్లతో దీక్షాపరుల సదనం నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు.
మూడు దశల్లో వేద పాఠశాల నిర్మాణం
సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో 1.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు దశల్లో వేద పాఠశాల నిర్మాణం చేపట్టనున్నారు. తొలి దశలోనే 500 మంది వేద విద్యార్థులు విద్యాభ్యాసం చేసే విధంగా సదుపాయాలు కల్పించనున్నారు. విద్యార్థుల కోసం వసతి గృహాలు, డైనింగ్ హాల్‌తో పాటు యజ్ఞశాల, యాగశాల నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు




ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుట్టా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
