Saturday, September 12, 2026
Homeతాజా సమాచారంసాగునీరు, 24 గంటల విద్యుత్‌ కోసం బీఆర్‌ఎస్‌ రైతు ధర్నా

సాగునీరు, 24 గంటల విద్యుత్‌ కోసం బీఆర్‌ఎస్‌ రైతు ధర్నా

నేరేడుచర్ల, ఆగస్టు 26, శుభోదయ డైనమిక్ వార్త

సాగునీరు అందించడంతో పాటు రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ నేరేడుచర్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ రైతు ధర్నా నిర్వహించారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకీడు మండలాలకు చెందిన సుమారు 500 మంది రైతులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

సాగర్‌ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలి

ధర్నాను ఉద్దేశించి హుజూర్‌నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి మాట్లాడుతూ సాగర్‌ ఎడమ కాల్వ నుంచి రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంటలు సాగు చేసుకునే కీలక సమయంలో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

నీళ్ల మంత్రి ఉత్తమ్‌పై బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు

ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోనే మంత్రి ఉండి కూడా సాగునీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కన్నీరు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులు పంటలు ఎండిపోతాయనే ఆందోళనలో ఉంటే, ప్రభుత్వం మాత్రం సాగునీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.“మన నియోజకవర్గంలోనే ఉండి రైతుల సమస్యలు కనిపించకపోవడం బాధాకరం” అని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే సాగునీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపుపై ప్రశ్నలు

రెండు లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పటికీ 15 రోజుల్లో నిండాల్సిన జలాశయాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో నిండలేదని ఒంటెద్దు నర్సింహారెడ్డి పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా నీటిని తరలించడం ఎందుకని ప్రశ్నించారు. “రైతుల నీటిని ఎవరి అబ్బ సొమ్ము అని తరలిస్తున్నారు?” అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

సాగునీరు, విద్యుత్‌ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. రైతులకు అవసరమైన సమయంలో నీరు అందకపోతే పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. సాగర్‌ ఎడమ కాల్వకు సమృద్ధిగా నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని కోరారు.

భారీగా పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు

ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్‌బాబు, మాజీ డీసీసీబీ డైరెక్టర్‌, ప్రస్తుత కౌన్సిలర్‌ అప్పిరెడ్డి, పాలకీడు మండల అధ్యక్షుడు కృష్ణపాటి అంజిరెడ్డి, గరిడేపల్లి మండల అధ్యక్షుడు కడియం వెంకట్‌రెడ్డి చిన్నబోయిన సైదులు, నాగండ్ల శ్రీధర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జయబాబు,పంగ శ్రీను,చిత్తలూరి సైదులు, చిట్యాల శ్రీను, ఇనుపాల పిచ్చిరెడ్డి, యాళ్లబోయిన లింగయ్య,బి ఆర్ ఎస్ కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు రాపోలు నవీన్‌, పల్లెపంగ నాగరాజు, అనంతు రాంబాబు, పర్వతం చంద్రగిరి, మూడు మండలాల రైతులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments