Friday, September 11, 2026
Homeతాజా సమాచారంజయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్‌కు...

జయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్‌కు ఘన నివాళులు

నల్గొండ బ్యూరో , ఆగస్టు 6,శుభోదయ డైనమిక్ వార్త

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిలిచిన జయశంకర్ విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపి, రాష్ట్ర సాధనకు విశేష కృషి చేశారని కొనియాడారు.ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం నల్గొండలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదే సందర్భంగా ప్రజాకవి గద్దర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు.

70 వేల ఉద్యోగాల భర్తీ.. ఎస్ఎల్‌బీసీతో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, తెలంగాణ కోసం జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి ఉద్యమానికి బలమైన పునాది వేశారని అన్నారు. శ్రీకాంత్ చారి వంటి అమరుల బలిదానాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి నాయకుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని, మరో 7 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టినట్లు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలు, న్యాక్ సెంటర్ల ద్వారా యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.2,000 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఎస్ఎల్‌బీసీ సొరంగం పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 700 మీటర్ల పనులు పూర్తయ్యాయని, 2028 ఆగస్టు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి దేవరకొండ నుంచి బ్రాహ్మణవెల్లెంల వరకు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డితో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయడమే ప్రొఫెసర్ జయశంకర్‌కు నిజమైన నివాళి అని అన్నారు.

గద్దర్ పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి

ప్రజాకవి గద్దర్‌ను స్మరించుకుంటూ మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ప్రజల్లో అపార చైతన్యం నింపాయని అన్నారు. ఊరూరా తిరుగుతూ పాటల ద్వారా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించిన గొప్ప కళాకారుడిగా గద్దర్ చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments