రూ.60 లక్షల విలువైన 37.2 తులాల బంగారం, 470 గ్రాముల వెండి స్వాధీనం
రూ.3.60 లక్షల నగదు, కారు, మొబైల్ ఫోన్ సీజ్
కారు డ్రైవర్ అరెస్ట్.. నిందితుడిపై గతంలోనూ దొంగతనం కేసులు
సూర్యాపేట బ్యూరో , సెప్టెంబర్ 9, శుభోదయ డైనమిక్ వార్త
కోదాడ పట్టణంలో రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కోదాడ పట్టణ పోలీసులు, జిల్లా సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన 37.2 తులాల బంగారు ఆభరణాలు, 470 గ్రాముల వెండి, రూ.3.60 లక్షల నగదు, హోండా అమేజ్ కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ, నిందితుడి అరెస్ట్, కేసుల దర్యాప్తు వివరాలను వెల్లడించారు.
కారు డ్రైవర్‌గా పనిచేస్తూ దొంగతనాలు
నిందితుడిని పట్నం శెట్టి రాజు అలియాస్ రాజిరెడ్డి (41)గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డినగర్ కాలనీలో నివాసం ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో 2009లో ఖమ్మంలో సైకిల్ దొంగతనం చేసి జైలుకు వెళ్లిన నిందితుడు, అనంతరం 2015, 2016 సంవత్సరాల్లో జగద్గిరిగుట్ట పరిధిలో ఐదు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కినట్లు వెల్లడించారు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం
నిందితుడు ప్రయాణికులను హైదరాబాద్ నుంచి కోదాడకు కారులో తీసుకొచ్చి, రాత్రి సమయంలో కోదాడలోనే ఉండేవాడు. తన కారును నిర్మానుష్య ప్రాంతంలో పార్క్ చేసి, నడుచుకుంటూ పట్టణంలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. అనంతరం స్క్రూడ్రైవర్‌తో ఇంటి ప్రధాన ద్వారం తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు, నగదును అపహరించేవాడు. దొంగిలించిన ఆభరణాల్లో కొన్నింటిని విక్రయించడం, మరికొన్నింటిని కరిగించడం, ఇంకొన్నింటిని ఫైనాన్స్ సంస్థల్లో కుదవ పెట్టడం ద్వారా వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలు, అప్పుల చెల్లింపులకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.
నకిలీ నంబర్‌తో పోలీసులకు చిక్కకుండా..
నిందితుడు తన హోండా అమేజ్ కారు అసలు రిజిస్ట్రేషన్ నంబర్ AP 28 BY 7770కు బదులుగా TS 07 GC 1612 అనే నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు అనుమానం రాకుండా ఈ విధంగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడేవాడని వెల్లడించారు.
2021 నుంచి 10 దొంగతనాలు
కోదాడ పట్టణంలో 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిందితుడు మొత్తం 10 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో 2026 సంవత్సరంలోనే ఏడు ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు తెలిపారు.
పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ నిందితుడు
విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలను విజయవాడకు తీసుకెళ్లి విక్రయించేందుకు కారులో వెళ్తుండగా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సూర్యాపేట నుంచి కోదాడ పట్టణంలోని ఫ్లైఓవర్ మీదుగా హుజూర్నగర్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్న సమయంలో పోలీసులను గమనించిన నిందితుడు వాహనాన్ని వెనక్కి తీసుకుని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేయగా డిక్కీలోని కవర్లలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు లభించాయి.అదేవిధంగా స్క్రూడ్రైవర్లు, షూ సాక్స్‌లు కూడా లభించడంతో పోలీసులు నిందితుడిని విచారించగా కోదాడ పట్టణంలో తాను చేసిన దొంగతనాలను అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి హోండా అమేజ్ కారు, వివో వై31 5జీ మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు
కేసుల దర్యాప్తును పర్యవేక్షించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, నిందితుడి అరెస్ట్‌లో కీలకంగా పనిచేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్, సీసీఎస్ ఎస్ఐలు హరికృష్ణ, సాయిరాం, ఎస్ఐ అజయ్‌కుమార్, సిబ్బంది వెంకన్న, విద్యాసాగర్, మల్లేష్, సతీష్, శివ, ప్రభాకర్, మంజులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
నేరాలకు పాల్పడిన వారు ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదని ఎస్పీ నరసింహ తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని, కాలనీల ప్రధాన మార్గాల్లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళ్లే వారు విలువైన వస్తువులు, నగదును ఇంట్లో ఉంచకూడదని సూచించారు. ఇరుగు పొరుగు వారికి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ దొంగతనాల నివారణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత కోసం నిరంతరం నిఘా కొనసాగిస్తూ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

