శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే, ఆగస్టు 17
మోతే మండల పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మోతే పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ సహాయంతో మండలంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.జాతీయ రహదారి వెంట ఉన్న దాబాలు, హోటళ్లు, కిరాణా దుకాణాలు, మెడికల్ షాపులతో పాటు పలు పాఠశాలల ప్రాంగణాలను డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు, నిల్వలు ఎక్కడైనా జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు నిశితంగా పరిశీలించారు.
మత్తు పదార్థాల విక్రయదారులపై కఠిన చర్యలు
ఈ సందర్భంగా ఎస్‌ఐ లచ్చిరెడ్డి మాట్లాడుతూ యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిధిలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి
మండలంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
‘రోలెక్స్’తో విస్తృతంగా తనిఖీలు
నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ సహాయంతో నిర్వహించిన తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ సిబ్బంది, మోతే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో డ్రగ్స్, గంజాయి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే వరకు తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
