శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్,ఆగస్టు 14
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని లింగగిరి గ్రామంలో చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారి బురదమయంగా మారి చెరువును తలపిస్తోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో అడపాదడపా కురుస్తున్న వర్షాలకే రహదారిపై భారీగా నీరు, బురద నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో ఈ మార్గం ఆర్‌అండ్‌బీ రహదారిగా ఉండగా, వర్షాల సమయంలో అక్కడక్కడ మాత్రమే నీరు నిలిచేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇటీవల రహదారిపై అధికారులు సరైన ప్రణాళిక లేకుండా మట్టిని పోయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారి మట్టి, నీరు కలిసి రహదారి మొత్తం బురదమయంగా మారుతోంది.దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు నడిచి వెళ్లేందుకు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారికి ఈ రహదారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.రహదారిని వెంటనే పరిశీలించి, నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయడంతో పాటు బురద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లింగగిరి గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
