Friday, September 11, 2026
Homeతాజా సమాచారంబాలానగర్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు 14.5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. రూ.3.75...

బాలానగర్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు 14.5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. రూ.3.75 లక్షల విలువ నలుగురు కీలక నిందితుల అరెస్ట్.. మూడు వాహనాలు, సెల్‌ఫోన్లు, ఎయిర్‌గన్ స్వాధీనం

మేడ్చల్ –మల్కాజిగిరి, ఆగస్టు 13, శుభోదయ డైనమిక్

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ఫోర్స్ చేపట్టిన ప్రత్యేక దాడిలో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టురట్టయింది. విశ్వసనీయ సమాచారంతో అధికారులు దాడి చేసి నలుగురు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

డీఎస్పీల నేతృత్వంలో ప్రత్యేక దాడి

డీఎస్పీలు రమేష్, నర్సింగ్‌రావు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు గడ్డం మల్లేష్, సంతోష్, రవికుమార్‌తో పాటు ఇతర సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్ల కిరణ్, అతని భార్య, స్థానిక నివాసి బొల్ల దుర్గాప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొల్ల కంళాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కంళాకర్ గంజాయి రవాణా, విక్రయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

భారీగా గంజాయి స్వాధీనం

దాడిలో 14.5 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.75 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. గంజాయితో పాటు మూడు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు, ఒక ఎయిర్‌గన్, నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల ఇంట్లో పోలీస్ కానిస్టేబుల్ ఉండటంపై కలకలం

దాడి సమయంలో నిందితుల ఇంట్లో స్థానిక పోలీస్ కానిస్టేబుల్ ఉండటం అధికారుల దృష్టికి రావడం చర్చనీయాంశంగా మారింది. అక్కడి నుంచి పోలీసులకు చెందిన అధికారిక మ్యాన్‌ప్యాక్ వైర్‌లెస్ సెట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.ప్రాథమిక విచారణలో ఆ వైర్‌లెస్ సెట్ బాలానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందినదిగా, అది ఎస్‌ఐపీ వినోద్‌కుమార్ ఆధీనంలో ఉన్నట్లు నిందితులు వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. కిరణ్‌కు పోలీస్ స్టేషన్‌లోని కొందరు సిబ్బందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకుని స్థానికులను బెదిరించేవాడని స్థానికుల నుంచి ఆరోపణలు వచ్చినట్లు తెలిపారు.

పరారీలో మరికొందరు నిందితులు

ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొందరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సరఫరా వ్యవస్థపై లోతైన దర్యాప్తు

అరెస్టైన నిందితులు, స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనాలు, కమ్యూనికేషన్ పరికరాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది, ఈ ముఠాకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇతర అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవహారాలతో సంబంధం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంతో పాటు మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments