Monday, July 27, 2026
Homeతాజా సమాచారంనేరేడుచర్ల మండలంలో ట్రాన్స్‌ఫార్మర్లే టార్గెట్..! వరుస దొంగతనాలతో రైతుల్లో ఆందోళన – బోరు సాగుకు తీవ్ర...

నేరేడుచర్ల మండలంలో ట్రాన్స్‌ఫార్మర్లే టార్గెట్..! వరుస దొంగతనాలతో రైతుల్లో ఆందోళన – బోరు సాగుకు తీవ్ర ముప్పు

నేరేడుచర్ల, జూలై 25,శుభోదయ డైనమిక్ వార్త

నేరేడుచర్ల మండలంలో వరుసగా జరుగుతున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, విద్యుత్ వైర్ల దొంగతనాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా బోర్ల ఆధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ దొంగతనాలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే సాగులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఇప్పుడు దొంగల బెడద మరో కొత్త కష్టంగా మారింది.

చిల్లేపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసిన దుండగులు

నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలోని ఉప్పల్‌కుంట ప్రాంతంలో ఉన్న 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, అందులోని లెగ్ వైర్లు, ఇతర విలువైన పరికరాలను అపహరించారు. శనివారం ఉదయం రైతులు తుంగ చెన్నారెడ్డి, నమస్తే రాములు, సైదులు తదితరులు పొలాలకు వెళ్లగా ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసమైన విషయం గుర్తించి వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు.

జూలై నెలలోనే వరుస దొంగతనాలు

మండలంలో జూలై నెలలోనే పలు ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలు చోటుచేసుకున్నాయి. చిల్లేపల్లి గ్రామంలో రెండు ఘటనలు నమోదు కాగా, జనాలదిన్నె, పత్తేపురం ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు, విద్యుత్ పరికరాలు, వైర్లు దొంగిలించబడినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో రైతులు రాత్రిపూట తమ వ్యవసాయ క్షేత్రాల వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వ్యవసాయానికి తీవ్ర ఆటంకం

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు దొంగిలించబడటంతో బోర్ల ద్వారా సాగునీరు అందక పంటలు ఎండిపోతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, కొత్త పరికరాల ఏర్పాటు పూర్తయ్యే వరకు సాగు పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు, విద్యుత్ శాఖ అప్రమత్తం కావాలి

మండలంలో వరుసగా విద్యుత్ పరికరాల దొంగతనాలు జరుగుతున్నప్పటికీ దొంగలను ఇప్పటివరకు గుర్తించి పట్టుకోవడంలో పురోగతి కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ కేంద్రాల వద్ద రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని, దొంగలను వెంటనే అరెస్టు చేసి రైతుల ఆస్తులకు రక్షణ కల్పించాలని వారు పోలీసు శాఖ, విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments