నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, జులై 27
శుభోదయ డైనమిక్ పత్రికలో నేరేడుచర్ల పట్టణంలోని మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలపై ప్రచురితమైన కథనానికి జిల్లా డ్రగ్స్ కంట్రోల్ శాఖ స్పందించింది. జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేందర్ ఆధ్వర్యంలో నేరేడుచర్ల మండల పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఒక షాపుకు నోటీసులు
తనిఖీల్లో ఒక మెడికల్ షాపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాల్సిన కనీస కొలతలు పాటించలేదని గుర్తించిన అధికారులు, సంబంధిత యజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.
కొలతలు, బిల్లులు, రిజిస్టర్లు తప్పనిసరి
మెడికల్ షాపులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, ప్రతి మందుల విక్రయానికి బిల్లు ఇవ్వడం తప్పనిసరి అని జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేందర్ తెలిపారు. హెచ్-1 వంటి నియంత్రిత మందుల విక్రయాలకు సంబంధించిన రిజిస్టర్లు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.
లైసెన్స్ రద్దుకు వెనుకాడం
నిబంధనలు ఉల్లంఘించే మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
