శుభోదయ డైనమిక్ వార్త , మఠంపల్లి, జులై 8
మఠంపల్లి మండలం రామచంద్రపురం గ్రామ శివారులోని వైకుంఠధామం పేకాటరాయులకు అడ్డాగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడగానే కొందరు వ్యక్తులు వైకుంఠధామం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి పేకాట ఆడటమే కాకుండా మద్యం సేవిస్తూ, చికెన్ విందులు చేసుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆస్తులకు నష్టం
పేకాట కోసం వచ్చే వ్యక్తులు గ్రామపంచాయతీకి చెందిన వస్తువులను ధ్వంసం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రామచంద్రపురంతో పాటు సమీప గ్రామాల నుంచి కూడా పలువురు వచ్చి అక్కడ పేకాట ఆడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
గ్రామస్తుల్లో ఆందోళన
ఇప్పటికైనా ఈ కార్యకలాపాలను అరికట్టకపోతే భవిష్యత్తులో గ్రామ మధ్యలోనే బహిరంగంగా పేకాట నిర్వహించే పరిస్థితులు తలెత్తుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసు, రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులను కోరుతున్నారు.
కార్యదర్శి వివరణ
ఈ విషయాన్ని రామచంద్రపురం గ్రామపంచాయతీ కార్యదర్శి సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైకుంఠధామంలో పేకాట నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన బాధ్యులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచించినట్లు వివరించారు.
