Saturday, April 18, 2026
Homeతాజా సమాచారంనల్గొండ జిల్లా యువతకు ఉపాధి అవకాశాల దిశగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు ప్రారంభం

నల్గొండ జిల్లా యువతకు ఉపాధి అవకాశాల దిశగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు ప్రారంభం

నల్గొండబ్యూరో, డైనమిక్,నవంబర్1

చదువుకున్న యువతకు, ముఖ్యంగా విద్యార్థినులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సెట్విన్ (SETWIN) ఆధ్వర్యంలో వివిధ సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి కోర్సుల ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు సృష్టించాలని ఆమె స్పష్టం చేశారు.శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో సెట్విన్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లాలోని అన్ని సంక్షేమ విద్యాసంస్థలు, పాఠశాలలు, కేజీ బీవీలలో సెట్విన్ కోర్సులు, వాటికి సంబంధించిన అర్హతలు, అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకోసం షెడ్యూల్ రూపొందించి వచ్చేవారం నుంచే కార్యక్రమాలను ప్రారంభించాలని సెట్విన్ ప్రతినిధి రేణుకను ఆదేశించారు.అలాగే మహిళల కోసం మహిళా ప్రాంగణాలలో బ్యూటిషన్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులు ఏర్పాటు చేయాలని, ప్రతి నియోజకవర్గానికి ఒక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బడి మానేసిన విద్యార్థులను కూడా ఈ శిక్షణా కార్యక్రమాల్లో చేర్చేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా సెట్విన్ ప్రతినిధి రేణుక మాట్లాడుతూ, “సాంకేతిక నైపుణ్యం ఉన్న యువత జీవితంలో సుస్థిర స్థానం సంపాదించగలరు. ప్రస్తుతం సెట్విన్ ద్వారా 30కి పైగా కోర్సుల్లో మూడు నుంచి ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తయిన వారికి డిప్లమా సర్టిఫికేట్లు అందజేస్తాం,” అని తెలిపారు. ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్న వారికి నామమాత్రపు ఫీజుతో శిక్షణా అవకాశాలు లభిస్తాయని ఆమె వివరించారు.ఈ సమావేశంలో గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, డిపిఓ వెంకయ్య, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, డిటిడిఓ చత్రు నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆర్‌సి ఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments