
డైనమిక్, నేరేడుచర్ల,నవంబర్ 5
కార్తీక పౌర్ణమి పుణ్యకాలంలో నేరేడుచర్ల శివాలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుండే మహిళా భక్తులు శివాలయాలకు తరలివచ్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సోమేశ్వర ఆలయంలో భక్తుల సందడి
నేరేడుచర్ల మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ సోమప్ప సోమేశ్వరాలయం, అలాగే పట్టణంలోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఆలయంలో బుదవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు, నేరేడుచర్ల సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ లు కుటుంబ సమేతంగా శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ చిత్తనూరు సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద మంత్రాలతో అభిషేకాలు, పూల అలంకారాలు
శ్రీ సోమేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శాస్త్రి, శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శివయ్య శాస్త్రి వేదమంత్రాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.అలంకార ప్రియుడైన శివయ్యను వివిధ పుష్పాలతో అలంకరించారు. ఆలయాలకు విచ్చేసిన భక్తులకు గోత్రనామాలతో పూజలు నిర్వహించి పాడి పంటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆయురారోగ్యాలు బావుండాలని దీవెనలు అందించారు.
సామూహిక వ్రతం – కోటి దీపోత్సవం ఈ నెల 10న
ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ రాచకొండ రామకోటేశ్వరరావు, ప్రధాన పూజారి శివయ్య శాస్త్రి తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లయకారుడైన ఈశ్వరుని అనుగ్రహం పొందాలని కోరారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మా శెట్టి సైదయ్య, లాయర్ రమణారెడ్డి, తాటికొండ శ్రీనివాస్ రెడ్డి, చిత్తనూరు రామకృష్ణ, నారద మోహన్ రెడ్డి, ఆరే కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
