డైనమిక్, కారం పూడి,అక్టోబర్29
తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని ఎన్‌టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద బుదవారం తెల్లవారుజామున పెద్ద చింతచెట్టు కూలి, చిరు వ్యాపారుల సముదాయాలపై పడింది.ఈ ప్రమాదంలో ఒక ఇల్లు, రెండు షెడ్లు కూలిపోవడంతో మూడు కుటుంబాలు రోడ్డునపడ్డాయి.
స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించేలా చర్యలు
ఈ ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర టిడిపి నాయకుడు పంగులూరి అంజయ్య, పట్టణ మాజీ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ, సీనియర్ నాయకుడు మస్తాన్ జానీ, మహిళా నాయకురాలు కాటంరెడ్డి నాగలక్ష్మి రెడ్డి, సర్పంచి సరస్వతి భాయ్ బాలునాయక్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
పంగులూరి అంజయ్య మాట్లాడుతూ —
“దెబ్బతిన్న ఇళ్లకు బదులుగా గ్రామ శివారులో స్థలాలు కేటాయించి వారికి కొత్త ఇళ్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపుతున్నాం,”అని తెలిపారు.
నలుగురు అనాధ పిల్లల సమస్యపై ప్రభుత్వం దృష్టి
ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలలో నలుగురు అనాధ పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వారి సమస్యను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వారికి ప్రభుత్వ స్థాయిలో సాయం అందేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.“పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ముందుకు వస్తుంది. అన్ని విధాలుగా వారికి సహాయం అందించడానికి కృషి చేస్తాం,”అని నేతలు పేర్కొన్నారు.
తక్షణ సహాయం – ₹10,000 నగదు, వంటసామాగ్రి అందజేత
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ₹10,000 తక్షణ సాయం, సరుకులు, వంట సామాగ్రి అందజేశారు.వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పంగులూరి అంజయ్య ప్రజలను కోరారు.



ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున ప్రతి కుటుంబం జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ సూచనలను పాటించాలని స్థానిక నాయకులు సూచించారు.
