నల్గొండ బ్యూరో , జూన్ 19,శుభోదయ డైనమిక్ వార్త
ఈనెల 21న నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 రీ ఎగ్జామినేషన్ను ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదేశాల మేరకు ఈ పరీక్షను జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులకు అదనపు సమయం
గతంలో నిర్వహించిన నీట్ పరీక్షతో పోలిస్తే ఈసారి అభ్యర్థులకు అదనంగా 15 నిమిషాల సమయం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా 65 నిమిషాల సమయం ఇచ్చి సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఏడు కేంద్రాల్లో పరీక్ష – సీఆర్పీఎఫ్ భద్రత
నల్గొండ జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలను కేటాయించగా, జిల్లాకు 15 మంది సిబ్బందిని పంపించారు. ప్రతి కేంద్రానికి ఇద్దరు చొప్పున భద్రతా సిబ్బందిని నియమించారు.
కొత్త అడ్మిట్ కార్డు తప్పనిసరి
అభ్యర్థులు పరీక్షకు ఒక రోజు ముందుగానే తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. రీ ఎగ్జామినేషన్ కోసం జారీ చేసిన కొత్త అడ్మిట్ కార్డును తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని తీసుకురావాలని, పాత అడ్మిట్ కార్డు చెల్లదని స్పష్టం చేశారు. అడ్మిట్ కార్డును పారదర్శక కవర్‌లో భద్రంగా తీసుకురావాలని సూచించారు.
పరీక్ష రోజున జిరాక్స్ కేంద్రాల మూసివేత
పరీక్ష నిర్వహించే జూన్ 21న నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సీసీ కెమెరాలు, జామర్లు తప్పనిసరి
ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు, జామర్లు, తనిఖీ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని చెప్పారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో నాలుగు రూట్లను ఏర్పాటు చేసి ప్రతి రూట్‌కు సెక్టోరియల్ మేజిస్ట్రేట్‌ను నియమించినట్లు తెలిపారు.
నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు ప్రయాణం
ఈ విడత నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అయితే అభ్యర్థులతో వచ్చే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సాధారణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్టీసీతో పాటు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఆటో సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీవోను ఆదేశించారు.
మధ్యాహ్నం 1:30 తర్వాత ప్రవేశం లేదు
అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. అభ్యర్థి తప్ప మరెవరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని, తల్లిదండ్రులకు కూడా ప్రవేశం ఉండదని తెలిపారు.
ప్రత్యేక వైద్య బృందాలు
పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రంలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అవాంఛనీయ సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలి
పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు, పోలీసు అధికారులకు సూచించారు. ఎక్కడైనా ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డీఆర్వో దశరథ్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. సుసింధర్ రావు, నీట్ పరీక్ష కన్వీనర్ మరియు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, డీఎస్పీ శివరామిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
