నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త,మే 11
నేరేడుచర్లలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యావారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమం మొదటి రోజు పాఠశాలలో నూతనంగా నిర్మించిన “సైన్స్ ల్యాబ్”ను నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొనతం వెంకటరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
సంగీత విభావరిలో మెరిసిన విద్యార్థులు
పాఠశాల సమ్మర్ క్యాంప్‌లో భాగంగా వాయిద్య పరికరాలతో సంగీత విభావరి నిర్వహించిన వర్ధమాన కళాకారులు సుచిర్, అక్షిత్‌లను అతిథులు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగరాజు, ఎంపీడీవో శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంఈఓ ఎం. బాలు, మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు ఇంజమూరి శ్రీకాంత్, యారవ లక్ష్మి, మత్స్యశాఖ అధ్యక్షులు యామిని వీరయ్య హాజరయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని పిలుపు
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్థుల సృజనాత్మకతకు సమ్మర్ క్యాంపులు దోహదం
విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో, సహపాఠ్య కార్యక్రమాల అభివృద్ధిలో సమ్మర్ క్యాంపులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. సైదులు, జానకిరాములు, నాగమణి, యాదగిరి, బాలు, వై. జానయ్య, బికోజి, జి. నాగేష్, ఆర్. రాజు, సరస్వతి, సరితతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

