నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు టి.ఎన్.జి.ఓ. భవనంలో ఆరోగ్య కార్యకలాపాలపై విస్తృత సమీక్షా సమావేశం జరిగింది. డి.యం.హెచ్.ఒ. డాక్టర్ పుట్ల శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, విభాగ ప్రోగ్రాం అధికారులు హాజరయ్యారు.
ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి
సమావేశంలో ఆధార్ ఆధారిత అటెండెన్స్ అమలుపై డాక్టర్ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. హాజరు వ్యవస్థలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.
అసంక్రమిత వ్యాధుల నియంత్రణ – ఉత్తమ పీహెచ్‌సీలకు అభినందనలు
అసంక్రమిత వ్యాధుల నియంత్రణలో పది పీహెచ్‌సీలు మంచి పనితీరు కనబరిచినందుకు డి.యం.హెచ్.ఒ. అభినందించారు. పనితీరులో వెనుకబడిన పీహెచ్‌సీలకు హెచ్చరికలు జారీ చేశారు.
క్షయ వ్యాధి నివారణలో వేగం పెంచాలి
కొత్త టిబి కేసుల గుర్తింపులో వెనుకబడి ఉన్నట్టు వివరిస్తూ, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాస్ స్పష్టంచేశారు. పోలీసు సిబ్బందికి ఎక్స్‌రే పరీక్షలను నిర్వాహించేలా ఆదేశాలు జారీ చేశారు.
హెపటైటిస్ పరీక్షలు–వ్యాక్సినేషన్‌పై దృష్టి
సిబ్బంది, ఆశా కార్యకర్తలు సహా ప్రతి గర్భవతి, మంగలికి హెపటైటిస్ పరీక్షలు నిర్వహించి వ్యాక్సిన్ ఇవ్వాలని డి.యం.హెచ్.ఒ. ఆదేశించారు.
గర్భవతుల గుర్తింపు–సేవలలో నిర్లక్ష్యానికి మెమోలు
ప్రతి గర్భవతిని సమయానికే గుర్తించి సేవలు అందించాలని, ఇందులో వెనుకబడిన పీహెచ్‌సీలకు ఇప్పటికే మెమోలు జారీ చేసినట్లు తెలిపారు.
బాలింతలు–పిల్లలకు టీకాలు తప్పనిసరి
బాలింతలు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల రేటు పెరగాలని, దీనిలో నిర్లక్ష్యానికి తావు లేదని స్పష్టం చేశారు.
సీజనల్ వ్యాధుల నివారణ–అవగాహన పెంచాలి
సీజనల్ వ్యాధుల విజృంభణను అరికట్టేందుకు ముందస్తు చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
వైద్యులు రోజుకు 60 మందికి సేవలు తప్పనిసరి
ప్రతి వైద్యుడు కనీసం 60 మంది ప్రజలకు సేవలందించాలని, సమయపాలనను కఠినంగా పాటించాలని డి.యం.హెచ్.ఒ. ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డై డి.యం.హెచ్.ఒ. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ కృష్ణకుమారి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ పద్మ, డాక్టర్ తిరుపతిరావు, ఇతర ప్రోగ్రాం అధికారులు, డాక్టర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు.
