సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్ ఫిబ్రవరి 12
పురపాలక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 13వ తేదీన పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
కౌంటింగ్ ప్రక్రియపై సమగ్ర అవగాహన
ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అనుసరించాల్సిన ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పత్రాల వర్గీకరణ, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం తదితర అంశాలపై అధికారులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రతి రౌండ్ పూర్తయ్యే సరికి ఫలితాలను ఖచ్చితంగా నమోదు చేసి, అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు.
పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ, పరిశీలకుల అనుమతి అనంతరం మాత్రమే విజేతలను ప్రకటించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు తెలిపారు. గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.సిబ్బంది ఉదయం 7 గంటలలోపు లెక్కింపు కేంద్రాలకు హాజరుకావాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
వ్యాలిడ్ – ఇన్వ్యాలిడ్ ఓట్లపై స్పష్టత అవసరం
జనరల్ అబ్జర్వర్ పాండా దాస్ మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. వ్యాలిడ్, ఇన్వ్యాలిడ్ ఓట్లపై పూర్తి అవగాహనతో వ్యవహరించాలని, ఒకసారి ఓటును సరైనదిగా లేదా చెల్లనిదిగా నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాన్ని మార్పు చేయకూడదని స్పష్టం చేశారు. సిబ్బంది సమయానికి హాజరై బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు.
శిక్షణలో పాల్గొన్న అధికారులు
ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఆర్డీవోలు వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
