డైనమిక్ , బాపట్ల జిల్లా, అక్టోబర్ 28
మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ కోస్తాంధ్ర ప్రత్యేక అధికారి, ఏపీ చేనేత–జౌలి శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్. పి. సిసోడియా ఆదేశించారు.
నల్లమడ కాల్వ వద్ద పరిశీలన
మంగళవారం బాపట్ల జిల్లాలో పర్యటించిన సిసోడియా, భారీ వర్షాల దాటికి ఉధృతంగా ప్రవహిస్తున్న హైదరిపేట నల్లమడ కాల్వ వద్ద పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.కాల్వ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం
“తుపాను తాకిడికి ప్రజలు, పశువులు ప్రాణ నష్టం చెందకూడదు. ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి” అని సిసోడియా అన్నారు.పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
సమగ్ర ప్రణాళికతో ముందస్తు చర్యలు
జిల్లాలో తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు.
బాపట్ల జిల్లాలో 30 ప్రధాన కాల్వలు, 42 మధ్యస్థ కాల్వలు ఉండగా, ఇవి 103 గ్రామాలను తాకుతూ వెళ్తున్నాయని వివరించారు.
పునరావాస కేంద్రాల్లో సదుపాయాలు
జిల్లాలో ఇప్పటివరకు 440 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 6,664 మందికి ఆశ్రయం కల్పించామని కలెక్టర్ తెలిపారు.ఆశ్రయం పొందుతున్న వారికి ఆహారం, నీరు, వైద్య సదుపాయాల లభ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు.
సహాయక చర్యలపై సమగ్ర నివేదిక
జిల్లాలో చేపడుతున్న సహాయక చర్యలపై సిసోడియాకు సమగ్ర నివేదికను కలెక్టర్ వినోద్ కుమార్ అందించారు.
ఈ సందర్భంగా జలవనరుల శాఖ అధికారి అబూతలీమ్, జెఈ సునీత, తదితర అధికారులు సిసోడియాతో పాటు ఉన్నారు.
