సూర్యాపేట బ్యూరో,డైనమిక్, అక్టోబర్ 28
జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆధ్వర్యంలో పోలీసు అధికారుల నెలవారీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గత నెలలో నమోదైన నేరాల స్థితిగతులను పరిశీలించి, కేసు దస్త్రాలను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులకు వివిధ సూచనలు చేశారు.
నేరాల నిరోధంలో సాంకేతికత కీలకం
పోలీసు సిబ్బంది సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు. పిర్యాదులపై వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వేగంగా చేరుకోవాలని,రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.పెండింగ్ కేసులు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోక్సో, మహిళా సంబంధిత కేసులు వేగవంతంగా కోర్టులతో సమన్వయంతో పూర్తి చేయాలని చెప్పారు.
సీసీటీవీ ఏర్పాటు – ప్రజల భాగస్వామ్యం అవసరం
నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం అని ఎస్పీ పేర్కొన్నారు. వ్యాపారులు, ప్రజలు ముందుకు వచ్చి ఎక్కువ సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. సీసీటీవీలతో నేరాలపై కఠిన పర్యవేక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.
రోడ్డు భద్రతపై ఎస్పీ సూచనలు
రోడ్డు ప్రమాదాల్లో ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని ఎస్పీ నరసింహ అన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని, వాహనాలపై నిలబడి ప్రయాణించడం, ఎక్కువ మంది ప్రయాణం చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
సమర్థవంతంగా పని చేసిన అధికారులకు రివార్డ్స్
గత నెలలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులను ఎస్పీ నరసింహ సన్మానించారు.కేసుల దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్లో ప్రతిభ కనబర్చిన కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్, సూర్యాపేట టూ టౌన్ ఎస్సై శివతేజ, అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్‌లకు ఎస్పీ రివార్డులు అందజేశారు.
పోలీసు వాహనాల తనిఖీ
పోలీసు వాహనాల నాణ్యత, కండిషన్‌ను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో వాహనాలు కీలకమని గుర్తు చేశారు. వాహనాలు ఎల్లప్పుడూ సక్రమంగా పనిచేయాలంటే క్రమం తప్పకుండా సర్వీసింగ్, నాణ్యత తనిఖీలు జరపాలని డ్రైవర్లకు సూచించారు.




సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఎస్పీలు ప్రసన్నకుమార్, రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు, ఇన్స్పెక్టర్లు శివశంకర్, ప్రతాప్ లింగం, రామకృష్ణా రెడ్డి, చరమందరాజు, నాగేశ్వరరావు, నరసింహారావు, రాజశేఖర్, వెంకటయ్య, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, అలాగే ఎస్ ఐ లు, ఐ టి కోర్ సిబ్బంది, డిసిఆర్బి సిబ్బంది పాల్గొన్నారు.
