Friday, September 11, 2026
Homeతాజా సమాచారంమట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

నేరేడుచర్లలో పినాకిల్ పాఠశాల విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ

నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 11

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పినాకిల్ పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి, నేరేడుచర్ల పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఇంటింటికీ వెళ్లి మట్టి విగ్రహాలపై అవగాహన

పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు మట్టిని సేకరించి వినాయక విగ్రహాలను తయారు చేశారు. అనంతరం చేతుల్లో మట్టి వినాయక విగ్రహాలు, పర్యావరణ పరిరక్షణ నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ మట్టి వినాయకులను పూజించాలని ప్రజలకు సూచించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార్ మాట్లాడుతూ పుస్తక విద్యతో పాటు సమాజం, పర్యావరణం పట్ల బాధ్యతను పెంపొందించుకోవడమే నిజమైన విద్య అన్నారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని తెలిపారు. విద్యార్థులు స్వయంగా మట్టి వినాయకులను తయారు చేసి, ర్యాలీ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమన్నారు.ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించి పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments