శుభోదయ డైనమిక్ వార్త , సూర్యాపేట బ్యూరో , ఆగస్టు 13
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడటంతో పాటు, వారి సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు.
సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించొద్దు
ఎస్సీల కోసం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్‌ప్లాన్ నిధులను పక్కాగా వినియోగించాలని బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిధులు మిగిలిపోతే వాటిని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించాలని సూచించారు.
రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యం వద్దు
ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగితే కమిషన్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఎంపీ నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్‌డీఎఫ్ నిధులను కూడా నిబంధనల ప్రకారం కేటాయించాలని అధికారులకు సూచించారు.
దాడుల కేసుల్లో త్వరితగతిన న్యాయం
ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసులను కోర్టుల్లో జాప్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచేలా సమర్థవంతమైన న్యాయపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో అధిక సంఖ్యలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.
ప్రతి నెలా సివిల్ రైట్స్ డే
బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రతి నెల చివరి వారంలో తప్పనిసరిగా ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించాలని ఎస్పీ నరసింహకు సూచించారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ఎస్సైలు, తహసీల్దార్లతో పాటు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
బాధితులకు ఇళ్లు, ఉపాధి కల్పించాలి
ఎస్సీ, ఎస్టీ దౌర్జన్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి అవకాశాలను త్వరితగతిన కల్పించాలని అధికారులను కోరారు. ‘భూభారతి’ ద్వారా ఎస్సీ, ఎస్టీల భూ సమస్యల పరిష్కారానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కలెక్టర్, ఎస్పీ పనితీరుపై ప్రశంసలు
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అందించిన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందని కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ప్రశంసించారు. ప్రతి అంశంపై పూర్తి సమాచారంతో ప్రణాళికలు సిద్ధం చేసి సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా కేసుల పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ నరసింహ వినూత్నంగా ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, శంకర్, అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్వో ప్రేమ్ రాజ్, ఎస్సీ డీడీ లతతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
