సూర్యాపేట బ్యూరో , జూన్ 18, శుభోదయ డైనమిక్ వార్త
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. విపత్తు నిర్వహణ, సహాయక చర్యలపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అప్రమత్తత
భారీ వర్షాలు, వరదల సమయంలో గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో తహసీల్దార్లు, డీపీఓలు తదితర అధికారులు వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని అన్నారు.
ముంపు ప్రాంతాల గుర్తింపు – పునరావాస కేంద్రాల ఏర్పాట్లు
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే కాలనీలు, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని ఆదేశించారు. బాధితులను తరలించేందుకు కమ్యూనిటీ హాళ్లు, రైతు వేదికలు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, అక్కడ తాగునీరు, విద్యుత్, రహదారి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
రక్షణ సామగ్రి సిద్ధంగా ఉంచాలి
విపత్తుల సమయంలో అగ్నిమాపక శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ల కోసం రోప్స్, కట్టర్స్, లైఫ్ జాకెట్లు తదితర సామగ్రిని అందుబాటులో ఉంచాలని ఫైర్ శాఖను ఆదేశించారు.
శిథిల భవనాలు, చెరువులపై ప్రత్యేక దృష్టి
పాత, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున వాటిని గుర్తించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులకు సూచించారు. చెరువులకు గండ్లు పడే అవకాశమున్న ప్రాంతాలు, ముంపు గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు.
మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశం
అత్యవసర సమయాల్లో అధికారులు పరస్పరం అందుబాటులో ఉండేందుకు కమ్యూనికేషన్ బుక్‌లెట్ రూపొందించాలని సూచించారు. విపత్తు నిర్వహణలో భాగంగా అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ముందస్తుగా మాక్ ఎక్సర్‌సైజ్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్‌రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
