సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్ మార్చి 14
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రాబరీ కేసును సూర్యాపేట జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి సుమారు రూ.13.35 లక్షల విలువైన బంగారం, వెండి, ఆటోలు తదితర సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ వెల్లడించారు.
వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకున్న ముఠా
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, షేక్ నశ్రీన్, కంచుకొమ్ముల సాయికిరణ్ కలిసి ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. ఆటోలను దొంగలించి వాటిలో ప్రయాణిస్తూ ఒంటరిగా వెళ్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని బెదిరించి ఆభరణాలు దోచుకోవడం వీరి పద్ధతిగా ఉందని తెలిపారు. అదేవిధంగా రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు కూడా చేస్తున్నట్లు చెప్పారు.
ఆత్మకూరు పరిధిలో రాబరీ
ఈ నెల 6న ఆత్మకూరు మండలంలోని కోటి నాయక్ తండా సమీపంలో ఓ వృద్ధురాలిని ఆటోలో ఎక్కించుకుని కొంత దూరం తీసుకెళ్లి చంపేస్తామని బెదిరించి ఆమె మెడలో ఉన్న వెండి గొలుసును దోచుకున్నారు. ఈ ఘటనపై బాధితులు మార్చి 10న ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తనిఖీల్లో నిందితుల పట్టివేత
దర్యాప్తులో భాగంగా జిల్లా సిసిఎస్, ఆత్మకూరు పోలీసులు టెక్నాలజీ సహాయంతో నిందితుల కదలికలను గుర్తించారు. శనివారం ఉదయం ఆత్మకూరు మండలంలోని ఎనుబాముల గ్రామ స్టేజ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా టీఎస్ 29 టీ 1190 నంబర్ ఆటోలో వెళ్తున్న నలుగురిని ఆపి విచారించగా నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
నిందితుల నుంచి రూ.3 లక్షల విలువైన 18 గ్రాముల బంగారం, రూ.5 లక్షల విలువైన 1.5 కిలోల వెండి, రూ.4 లక్షల విలువైన మూడు ఆటోలు, ట్యాబ్, ల్యాప్‌టాప్, ఒక బైక్, ఒక టీవీ, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు
అరెస్టు అయిన వారిలో కోదాడ రాజీవ్ నగర్‌కు చెందిన కంచుకొమ్ముల సంతోష్ (A1), కంచుకొమ్ముల గణేష్ (A2), షేక్ నశ్రీన్ (A3), కంచుకొమ్ముల సాయికిరణ్ (A4) ఉన్నారు. వీరిలో సంతోష్, సాయికిరణ్ అన్నదమ్ములు కాగా గణేష్ వారి బాబాయి కుమారుడు. షేక్ నశ్రీన్ సంతోష్ భార్యగా గుర్తించారు. ఈ కేసులో మరో బాల నేరస్థుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలోనూ కేసులు
ప్రధాన నిందితుడు కంచుకొమ్ముల సంతోష్‌పై కోదాడ టౌన్, కోదాడ రూరల్, వేములపల్లి, నిడమానూరు, ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో మొత్తం 9 కేసులు ఉన్నట్లు గుర్తించారు. గణేష్‌పై మూడు కేసులు, సాయికిరణ్‌పై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల అభినందన
ఈ కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్, సిసిఎస్ ఎస్సై హరికృష్ణ, ఆర్ఎస్ఐ రాజశేఖర్ మరియు పోలీస్ సిబ్బందిని ఎస్పీ నరసింహ అభినందించారు.
