సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 12
ప్రజల ఆరోగ్యాలను హరించే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. నమ్మదగిన సమాచారం మేరకు సూర్యాపేట పట్టణంలోని మెయిన్ రోడ్ ప్రాంతంలో కొన్ని వస్త్ర దుకాణాల్లో ఉక్కా విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పట్టణ పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.
వస్త్ర దుకాణాల్లో దొరికిన ఉక్కా ప్యాకెట్లు
పోలీసుల తనిఖీలలో మెయిన్ రోడ్డులో ఉన్న ఆర్.వి ఫ్యాషన్స్, ఎక్స్ట్రీమ్ ఫ్యాషన్స్ వంటి దుకాణాల్లో ఉక్కా ప్యాకెట్లు అమ్ముతున్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి సుమారు రూ.15 వేల విలువైన ఉక్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
ఉక్కా వంటి పదార్థాల వినియోగం ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమని ఎస్పీ నరసింహ తెలిపారు. ముఖ్యంగా యువత ఇలాంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సమాచారం అందిస్తే చర్యలు
పట్టణంలో ఎక్కడైనా ఉక్కా లేదా ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
