Monday, March 2, 2026
Homeజాతీయంసూర్యాపేట జిల్లావ్యాప్తంగా యూరియా యాప్ గందరగోళం గంటల తరబడి డౌన్ అయిన సర్వర్‌తో రైతులకు తీరని...

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా యూరియా యాప్ గందరగోళం గంటల తరబడి డౌన్ అయిన సర్వర్‌తో రైతులకు తీరని వేదన జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన యూరియా పంపిణీ

డైనమిక్ న్యూస్, సూర్యాపేట బ్యూరో, ఫిబ్రవరి 10

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మంగళవారం  యూరియా బస్తాల పంపిణీ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ, ఆన్లైన్ సర్వర్ గంటల తరబడి పనిచేయకపోవడంతో రైతులకు యూరియా అందడం లేదు. పీఓఎస్ మిషన్‌లో ఆధార్ ఓటీపీ తప్పనిసరి అంటూ అధికారులు నిబంధనలు విధించడంతో జిల్లా అంతటా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

నేరేడు చర్ల మండలంలోనూ అదే పరిస్థితి

జిల్లాలోని నేరేడు చర్ల మండలం పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. యూరియా కోసం రైతులు సహకార కేంద్రాలు, ఎరువుల డీలర్ షాపుల వద్ద గంటల తరబడి ఎదురుచూసినా, సర్వర్ డౌన్ అంటూ యూరియా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు తీవ్రమై ఉండటంతో ఆధార్‌కు ఓటీపీలు రావడం లేదని వారు తెలిపారు.

ఓటీపీ నిబంధన రైతుల సహనానికి పరీక్ష

ఆధార్ కార్డుకు ఓటీపీ వచ్చినప్పుడే యూరియా ఇవ్వాలన్న నిబంధన రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. సర్వర్ అందుబాటులో లేకపోయినా నిబంధనలను సడలించకుండా అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ రాకపోతే యూరియా ఇవ్వలేమని చెప్పడం రైతులపై భారం మోపినట్లేనని విమర్శిస్తున్నారు.

24 గంటల గడువు… రైతులకు శిక్షలా మారిన నిబంధన

యాప్ ద్వారా బుక్ చేసుకున్న యూరియాకు కేవలం 24 గంటల గడువు మాత్రమే ఉండటం రైతులకు శిక్షలా మారింది. సర్వర్ సమస్యల కారణంగా గడువు లోపు యూరియా తీసుకోలేకపోతే బుకింగ్ రద్దవుతోంది. గడువు ముగిసిన తర్వాత మళ్లీ బుక్ చేసుకోవాలంటే ఎటు వెళ్లాలో, ఎవరి వద్ద చెప్పుకోవాలో తెలియక రైతులు అయోమయంలో పడుతున్నారు.

మళ్లీ ఓటీపీ లింక్… అదే తలనొప్పి

ఇప్పటికే బుక్ చేసుకున్న రైతులకు కూడా మళ్లీ ఆధార్ ఓటీపీ లింక్ పెట్టడం ద్వారా యూరియా ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం సమస్యను మరింత తీవ్రం చేసింది. ప్రస్తుతం సర్వర్ అందుబాటులో లేకపోవడంతో ఓటీపీలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. అయినా కూడా యూరియా ఇవ్వకుండా అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

పంటలపై ప్రతికూల ప్రభావం

పంటలు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా అందకపోవడం వల్ల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు నష్టపోతున్నా, సంబంధిత శాఖ అధికారులు సమస్యను క్షేత్రస్థాయిలో సమీక్షించకపోవడం పరిపాలనా వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు.

తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా, నేరేడు చర్ల మండలం సహా అన్ని ప్రాంతాల్లో సర్వర్ సమస్యలు పరిష్కరించే వరకు ఆధార్ ఓటీపీ నిబంధనను తాత్కాలికంగా సడలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యాప్ గడువు నిబంధనలను రద్దు చేసి, యూరియా బస్తాలు తక్షణమే అంద జేయకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి వివరణ

ఆన్లైన్ సర్వర్ ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే కానీ అది సెంట్రల్ సర్వర్ టెక్నికల్ ఇష్యూ వున్నది. రెండు మూడు గంటల్లో సమస్య క్లియర్ అవుతుంది. అదే పని సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments