Friday, February 6, 2026
Homeజాతీయంమిర్యాలగూడ నుంచే మున్సిపల్ ఎన్నికల తొలి సమరం : సీఎం రేవంత్ రెడ్డిఏప్రిల్ బడ్జెట్‌లో మరోసారి...

మిర్యాలగూడ నుంచే మున్సిపల్ ఎన్నికల తొలి సమరం : సీఎం రేవంత్ రెడ్డిఏప్రిల్ బడ్జెట్‌లో మరోసారి లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు – పేదల ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యం

మిర్యాలగూడ, డైనమిక్ డెస్క్ న్యూస్, ఫిబ్రవరి 4

ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనున్న నూతన బడ్జెట్‌లో మరోసారి లక్షలాది ఇందిరమ్మ ఇండ్లను పేదలకు మంజూరు చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పరిధిలోని గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన

సభకు ముందు రూ.200 కోట్ల వ్యయంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో ఇలాంటి 100 పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది

మున్సిపల్ ఎన్నికల తొలి సమరం మిర్యాలగూడ నుంచే ప్రారంభమైందని సీఎం ప్రకటించారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం పేదలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, యువత కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.

రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్

గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేషన్ కార్డులు ఇచ్చి, మూడు కోట్ల 15 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వ్యవసాయానికి ఉచిత కరెంట్ అందిస్తున్నామని, దీని వల్ల 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు.

రైతులకు భారీ ఆర్థిక మద్దతు

రైతు రుణమాఫీ కింద 25 లక్షల 30 వేల మంది రైతులకు రూ.21 వేల కోట్లు ఇచ్చామని, రైతు భరోసా కింద ఒకేరోజు రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మరో విడత రైతు భరోసా నిధులు అందిస్తామని ప్రకటించారు.దేశంలోనే రైతుల సంక్షేమానికి రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

మహిళలకే ప్రత్యేక ప్రాధాన్యం

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, స్వయం సహాయక సంఘాల మహిళలను 1000 బస్సుల యజమానులుగా చేశామని తెలిపారు. మహిళలకు జీరో వడ్డీపై రూ.27 వేల కోట్ల రుణాలు ఇప్పించామని వెల్లడించారు.

ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు ఆత్మగౌరవం

తమ ప్రభుత్వం తొలి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, ఎమ్మెల్యేలంతా మరిన్ని ఇండ్లు కావాలని కోరుతున్నారని చెప్పారు. ఏప్రిల్ బడ్జెట్‌లో లక్షలాది ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

అభివృద్ధి పనులకు వేల కోట్ల నిధులు

రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, రెండు సంవత్సరాల్లో ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేస్తామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రూ.17,472 కోట్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.2,028 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడారు. సమావేశానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే అధ్యక్షత వహించగా, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, వేముల వీరేశం, పద్మావతి రెడ్డి, వంశీకృష్ణ, జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments