Saturday, April 18, 2026
Homeతాజా సమాచారంసూర్యాపేట జిల్లాలో 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంతుఫాన్ ప్రభావం దృష్ట్యా రైతులకు అప్రమత్తం –...

సూర్యాపేట జిల్లాలో 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంతుఫాన్ ప్రభావం దృష్ట్యా రైతులకు అప్రమత్తం – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 27

ఈ వానాకాలం ధాన్యం సేకరణలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 40 వేల ఎకరాలలో వరి కోతలు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖల అధికారులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యాపేట జిల్లాలో ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్ల పురోగతిని వివరించారు.

తుఫాన్ ప్రభావం పట్ల అప్రమత్తం

కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న రెండు మూడు రోజులు “మొంత తుఫాన్” ప్రభావం సూర్యాపేట జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. గ్రామపంచాయతీ స్థాయిలో కూడా అధికారులు ప్రజలకు హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు టార్పాలిన్‌లు కప్పి ఉంచాలని, రెండు రోజులపాటు వరి కోతలు నిలిపివేయాలని సూచించారు. తుఫాన్ తీవ్రత వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు.

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూచనలు

రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావం కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా సాగేందుకు అవసరమైన మౌలిక వసతులు, టార్పాలిన్‌లు, డ్రయ్యర్లు, శుభ్రపరిచే యంత్రాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రాబోయే 45 రోజులు రైతులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరిక

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “మొంత తుఫాన్” ప్రభావం కొమరం భీమ్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. రైతులు తుఫాన్ తగ్గే వరకు వరి కోతలు చేయవద్దని, ఇప్పటికే కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.మొక్కజొన్న, పత్తి తేమ శాతాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా క్రాప్ కటింగ్ ఆధారంగా ఆధార్ లింకుతో పర్యవేక్షణ చేయాలని అన్నారు.

జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆదేశాలు

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్లు, వ్యవసాయ అధికారులతో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్‌లు సిద్ధంగా ఉంచాలని, తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిపిసి సెంటర్లకు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలనీ, పత్తి తేమ శాతం 8–12% మధ్య ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.పక్క రాష్ట్రాల ధాన్యం రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాటిని ఆర్డీవోలు, పోలీసు అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎస్ఓ మోహన్ బాబు, సివిల్ సప్లై మేనేజర్ రాము, డీఏవో శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, డీసీఓ పద్మ, ఏపీడీ సురేష్, సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ బెనర్జీ, ఏఎస్ఓ శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments