Tuesday, June 30, 2026
Homeతాజా సమాచారంలాల్ లక్ష్మీపురంలో సీసీ రోడ్డుపై మరోసారి సీసీ రోడ్డు..?పంచాయతీ నిధుల దుర్వినియోగానికి కుట్రేనా అంటూ గ్రామస్థుల...

లాల్ లక్ష్మీపురంలో సీసీ రోడ్డుపై మరోసారి సీసీ రోడ్డు..?పంచాయతీ నిధుల దుర్వినియోగానికి కుట్రేనా అంటూ గ్రామస్థుల తీవ్ర ఆరోపణలు ఉన్న సీసీ రోడ్డుపై మట్టి పోసి కొత్త రోడ్డు పనులకు సిద్ధం?

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, జూన్ 30

నేరేడు చర్ల మండల పరిధిలోని లాల్ లక్ష్మీపురం గ్రామంలో ఇప్పటికే నిర్మించిన సీసీ రోడ్డుపై మరోసారి సీసీ రోడ్డు వేయడానికి గ్రామ పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు గ్రామంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందని బహిరంగంగా విమర్శిస్తున్నారు.

“సీసీ రోడ్డుపై మళ్లీ సీసీ ఎలా వేస్తారు..?”

ఇప్పటికే వినియోగంలో ఉన్న సీసీ రోడ్డుపై మరోసారి సీసీ రోడ్డు వేయడానికి ప్రభుత్వం నుంచి ఏదైనా జీవో (GO) లేదా ప్రత్యేక అనుమతి ఉందా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మట్టి పోసి పాత రోడ్డును కనిపించకుండా చేశారనే ఆరోపణలు

కొత్త రోడ్డు పనులకు అనుకూలంగా ఉండేలా పాత సీసీ రోడ్డుపై పెద్ద ఎత్తున మట్టి పోసి రోడ్డు కనిపించకుండా చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.

వర్షాకాలంలో ప్రమాదాలకు ఆహ్వానం

రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో వర్షాలు పడితే బురదగా మారి వాహనాలు జారిపడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు కూడా ఆ మార్గంలో నడవడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొన్నదని అంటున్నారు.

నిధుల కాజేతకు పథకమా..?

ఉన్న రోడ్డును తొలగించకుండా దానిపైనే మరోసారి సీసీ రోడ్డు వేయడం వెనుక గ్రామ పంచాయతీ నిధులను అక్రమంగా ఖర్చు చేసి కొందరు లబ్ధి పొందాలనే ఉద్దేశం ఉందని గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గ్రామ పాలనా తో పాటు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నారని విమర్శిస్తున్నారు.

గ్రామ కార్యదర్శి పాత్రపై ప్రశ్నలు

గ్రామంలో పెద్ద ఎత్తున మట్టి తొలి పనులు జరుగుతుండగా గ్రామ కార్యదర్శికి ఈ విషయం తెలియదా? తెలిసి కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తున్నారు.

కలెక్టర్, డీపీవో వెంటనే జోక్యం చేసుకోవాలి

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ప్రజాధనాన్ని కాపాడాలని కోరుతున్నారు

.గ్రామ కార్యదర్శి అరుణ వివరణ..

లాల్ లక్ష్మీపురం గ్రామంలో సీసీ రోడ్డుపై మట్టి పోసిన ఘటనపై గ్రామ కార్యదర్శి స్పందించారు. సీసీ రోడ్డుపై మట్టి పోసిన విషయం తన దృష్టికి రాలేదని ఆమె తెలిపారు.అలాగే ఇప్పటికే ఉన్న సీసీ రోడ్డుపై మరోసారి సీసీ రోడ్డు వేయడానికి ఎలాంటి ప్రభుత్వ జీవో (జి.ఓ.) లేదని, అలాంటి పనులు చేయకూడదని స్పష్టం చేశారు.రోడ్డుపై పోసిన మట్టి కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయం తెలిసిన వెంటనే ఆ మట్టిని తొలగించే చర్యలు తీసుకుంటానని గ్రామ కార్యదర్శి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments