సూర్యాపేట బ్యూరో , డైనమిక్ న్యూస్,జనవరి 23
వ్యవసాయం ఒక విజ్ఞానమని, గతంలో ఉన్న జై జవాన్ – జై కిసాన్ నినాదం కాలక్రమంలో జై జవాన్ – జై కిసాన్ – జై విజ్ఞాన్గా మారిందని, ప్రస్తుతం అది జై జవాన్ – జై కిసాన్ – జై విజ్ఞాన్ – జై అనుసంధాన్గా విస్తరించిందని రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.
మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనం
శుక్రవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు.
ప్రభుత్వ శాఖల స్టాల్స్ పరిశీలన
ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను గవర్నర్ సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.
150 కోట్లతో వ్యవసాయ కళాశాల శంకుస్థాపన
హుజూర్నగర్ సమీపంలోని ముగ్దుం నగర్ వద్ద 100 ఎకరాల విస్తీర్ణంలో 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు గవర్నర్ శంకుస్థాపన చేశారు. రైతులకు శాస్త్రీయ పరిజ్ఞానం అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
50 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయం
కోదాడ సమీపంలో 50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న జవహర్ నవోదయ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని గవర్నర్ అన్నారు.
మట్టపల్లి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో
కోటి రూపాయలతో యాత్రికా సదన్, నూతన కిచెన్ షెడ్ మరో కోటి రూపాయలతో డార్మెటరీ భవనాల నిర్మాణాలకు గవర్నర్ శంకుస్థాపన చేశారు.
రైతులకు యంత్ర పరికరాల ప్రోసీడింగ్స్
ఈ సందర్భంగా రైతులకు రూ.2 కోట్ల 47 లక్షల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాల ప్రోసీడింగ్స్ అందజేశారు.అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలకు
బ్యాంకు లింకేజీ కింద రూ.504 కోట్లు
ఆదాయ వనరుల పెంపుదల కోసం రూ.89 కోట్లు
చెక్కుల రూపంలో అందజేశారు.వసంత పంచమి రోజున మట్టపల్లి దర్శనం సంతోషం వసంత పంచమి రోజున పవిత్ర కృష్ణానది తీరంలో ఉన్న మట్టపల్లి స్వయంభు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం అదృష్టమని గవర్నర్ అన్నారు. కృష్ణ, గోదావరి, కావేరి నదులు ఉండటం, ఇలాంటి ఆలయం ఉండటం ఇక్కడి ప్రజల భాగ్యమన్నారు.
తెలంగాణలో వ్యవసాయ పురోగతి అభినందనీయం
జిల్లాలో పెద్ద ఎత్తున వ్యవసాయం సాగు చేయడం, ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు.
తెలంగాణ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం : మంత్రి ఉత్తమ్
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. 85 శాతం ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు.మట్టపల్లి అభివృద్ధికి ఇప్పటికే కృషి చేశానని, భవిష్యత్తులో మరింత అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. హుజూర్నగర్ – మట్టపల్లి మధ్య రూ.80 కోట్లతో డబుల్ రోడ్డును మంజూరు చేశామని, గతంలో రూ.50 కోట్లతో బ్రిడ్జి నిర్మించామని వివరించారు. కృష్ణ, గోదావరి జలాల హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు.
ఐటీ కన్నా వ్యవసాయ రంగమే ముందుంటుంది : మంత్రి తుమ్మల
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఐటీ, ఏఐ కన్నా వ్యవసాయ రంగమే కీలకంగా మారుతుందన్నారు. తెలంగాణ దేశానికే వరి అందించే రాష్ట్రంగా మారిందని చెప్పారు.రాష్ట్రంలో ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని తెలిపారు.
పలువురు ప్రజాప్రతినిధుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్తాఫ్ జానయ్య, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వందన సమర్పణ చేయగా, ఎంపీ కుందూర్ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూర్ జయవీర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, జిల్లా ఎస్పీ కె. నరసింహ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



