హైదరాబాద్,డైనమిక్ డెస్క్ ,అక్టోబర్ 22
రాష్ట్రంలోని అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ తక్షణమే చర్యలు తీసుకొని ఉత్తర్వులు విడుదల చేసింది.రవాణా శాఖ కమిషనర్ ఆకస్మిక ఆదేశాలు జారీ చేస్తూ, ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా చెక్‌పోస్టుల మూసివేతపై పూర్తి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల కార్యకలాపాలు తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు.చెక్క్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇతర బాధ్యతల్లో వినియోగించుకోవాలని సూచించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్‌పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బ్యారికేడ్లు తొలగించాలని డీటీవోలకు ఆదేశాలు ఇచ్చారు.అదే విధంగా చెక్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను సంబంధిత డీటీవో కార్యాలయాలకు తరలించాలని కమిషనర్ తెలిపారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను పరిశీలించి భద్రపరచాలని సూచించారు.ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వాహన రవాణాకు మరింత సౌకర్యం కలుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

