ఎపి, తెలంగాణా, డైనమిక్ డెస్క్
తెలుగు రాష్ట్రాలు బుదవారం కార్తీక పౌర్ణమి ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో మారుమోగుతున్నాయి. శివాలయాలు నిండా భక్తుల సందోహం, పూజా కార్యక్రమాలతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ప్రాంతంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహిస్తూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదుల్లో వదిలే ఆచారం విశేషంగా కనిపించింది.
శ్రీశైలంలో భక్తుల రద్దీతో కిటకిట
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు చేసి స్వామి, అమ్మవార్ల దర్శనార్థం దీర్ఘ క్యూలైన్లలో నిలుస్తున్నారు. సాధారణ దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
వరంగల్ శైవక్షేత్రాల్లో దీపోత్సవాలు
వరంగల్ జిల్లాలోని వేయిస్తంభాల గుడి, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాలు భక్తి గీతాలతో, శివనామస్మరణతో మారుమోగాయి.
నల్లగొండ జిల్లాలో భక్తి జోష్
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివాలయాలన్నీ “ఓం నమశ్శివాయ” నినాదాలతో మారుమోగాయి.
మెదక్–సంగారెడ్డి జిల్లాల్లో వైభవం
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని బొంతపల్లి వీరభద్ర స్వామి, బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఝారాసంగం కేతకి సంగమేశ్వర, సంగారెడ్డి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు దీర్ఘ క్యూలైన్లలో బారులు తీరారు.
భద్రాచలం వద్ద గోదావరి తీరం భక్తులతో కిటకిట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి తీరం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, కార్తీక దీపాలు వెలిగించి శివపూజలు చేస్తున్నారు. మణుగూరు సబ్‌డివిజన్ పరిధిలోని శివాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద దీపారాధనలు, పూజలు ప్రారంభమయ్యాయి.
