Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంమొంథా తుఫాన్ ప్రభావం – నల్గొండ జిల్లా అధికారులు హై అలర్ట్‌లో వుండి జిల్లా కేంద్రం...

మొంథా తుఫాన్ ప్రభావం – నల్గొండ జిల్లా అధికారులు హై అలర్ట్‌లో వుండి జిల్లా కేంద్రం నుండి గ్రామాల వరకూ అధికారులు కార్యస్థలాల్లో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు

నల్గొండ బ్యూరో, అక్టోబర్ 29 (డైనమిక్ న్యూస్)

మొంథా తుఫాన్ కారణంగా నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జిల్లా కేంద్రం నుండి గ్రామస్థాయివరకు సిబ్బంది తమ తమ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండి ప్రజలకు తక్షణ సహాయం అందించాలన్నారు.

టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సూచనలు

బుధవారం జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ — “ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.
వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లనుండి బయటకు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

రైతులు పొలాలకు వెళ్లరాదు – పిడుగుపాటు, పాముకాటుకు హెచ్చరిక

రైతులు పంట కోతలు చేయకూడదని, పొలాల్లోకి వెళ్లడం వల్ల పిడుగుపాటు, పాముకాటు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు.
పశువులను కూడా పొలాల్లో వదలరాదని, వాటికి పిడుగుపాటు ప్రమాదం ఉందని సూచించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

వర్షం వల్ల తడిసి పడిపోయే ఇళ్లు, ప్రమాదకర గృహాలు ఖాళీ చేయించాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అలాంటి ఇళ్లను గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

పాఠశాలలకు సెలవు – విద్యార్థుల భద్రతపై దృష్టి

వర్షాల దృష్ట్యా పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ తెలిపారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ఆర్సీవోలు పర్యవేక్షణ చేయాలని ఆమె సూచించారు.

వాగులు, వంకలు దాటవద్దు – యువతకు హెచ్చరిక

ప్రజలు, ముఖ్యంగా యువత వాగులు, వంకలు, నదుల వద్ద ఈతకు, చేపలు పట్టేందుకు, బట్టలు ఉతకడానికి వెళ్లరాదని కలెక్టర్ హెచ్చరించారు.
పొంగిప్రవహించే వాగులు, బ్రిడ్జిలు, కాజ్‌వేలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.

ధాన్యం, పత్తి పంటలు తడవకుండా చర్యలు

రైతులు ధాన్యం, పత్తి పంట కోతలను వాయిదా వేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం, పత్తిపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని కలెక్టర్ సూచించారు.
పంటలు తడవకుండా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు

వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖలకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
కోతలు, గుంతలు పడిన చోట్ల యంత్రసామగ్రి సిద్ధంగా ఉంచాలని సూచించారు.

విద్యుత్ శాఖ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి

విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు కలెక్టర్ సూచించారు.
వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, వేలాడే వైర్లు తక్షణమే సరిచేయాలని ఆదేశించారు.

దేవరకొండలో 12 సెంటీమీటర్ల వర్షపాతం

దేవరకొండ డివిజన్‌లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు.ఈ ప్రాంతంలోని గిరిజన తండాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.అక్కడి క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల అవసరాలకు తక్షణ స్పందన ఇవ్వాలని ఆదేశించారు.

24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.ప్రజలు వర్షాలకు సంబంధించిన అత్యవసర సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-1442 కు తెలియజేయాలని ఆమె కోరారు.

అదనపు కలెక్టర్ సూచనలు

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ — వర్షాల సమయంలో ప్రజల భద్రత, రహదారి పునరుద్ధరణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై శాఖల అధికారులకు తగిన సూచనలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments