నల్లగొండ బ్యూరో ,అక్టోబర్ 29 (డైనమిక్ న్యూస్):
మొంథా తుఫాన్ ప్రభావంతో నల్లగొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాలో ఆందోళన వాతావరణం సృష్టించాయి. అనేక గ్రామాలు, తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ సందర్భంలో దేవరకొండ మండలంలోని కోమ్మెపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నీరు ఊచకోతలా వచ్చి చేరడంతో విద్యార్థులు ఒక దశలో ప్రమాదంలో చిక్కుకున్నారు.
ఎస్పీ స్వయంగా పర్యవేక్షణ – సమయానికి రక్షణ చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వేగంగా స్పందించి, పోలీసు సిబ్బందితో కలిసి పాఠశాల పరిసర ప్రాంతానికి చేరుకున్నారు. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులందరినీ తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఆదేశాలు ఇచ్చి స్వయంగా పర్యవేక్షించారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు సమన్వయంతో పనిచేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా విద్యార్థులందరూ క్షేమంగా బయటపడ్డారు.
‘ప్రజల ప్రాణరక్షణే మా ధ్యేయం’ – ఎస్పీ శరత్ చంద్ర పవార్
పిల్లలను ధైర్యం చెప్పిన ఎస్పీ పవార్ మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలు కాపాడడం పోలీసు వ్యవస్థ యొక్క మొదటి బాధ్యత. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దు” అని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బందితో సమన్వయంగా పర్యవేక్షణ కొనసాగుతున్నదని తెలిపారు.
జిల్లా ప్రజల ప్రశంసల పాలు అయిన ఎస్పీ చొరవ
తుఫాన్ సమయంలో చూపిన చాకచక్యంతో, సమయస్ఫూర్తితో విద్యార్థులను రక్షించిన ఎస్పీ పవార్ పై ప్రజలు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎస్పీ నాయకత్వంలో పోలీసు వ్యవస్థ వేగవంతంగా స్పందించడం జిల్లా మొత్తానికి ఆదర్శంగా నిలిచింది.
