నల్గొండ బ్యూరో,అక్టోబర్ 30 , డైనమిక్
మొంథా తుఫాను ప్రభావం దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై సమీక్ష జరిగింది.
24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తుఫాను నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు సమయానుకూలంగా అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు వర్షాలు, నష్టం లేదా అత్యవసర పరిస్థితులపై సమాచారం ఇవ్వడానికి 1800–425–1442 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సెలవులు రద్దు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని స్థాయిల అధికారులూ — జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి సిబ్బంది తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టంగా ఆదేశించారు. ఎవరూ అనుమతి లేకుండా సెలవుపై వెళ్లరాదని, విధులకు గైర్హాజరు అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు
లోతట్టు ప్రాంతాలు, కాజ్‌వేలు, చెరువులు, వాగులు, బ్రిడ్జిల వద్ద సిబ్బందిని మోహరించాలని సూచించారు. నీరు పొంగిప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలను వెళ్లనివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించాలన్నారు. చెరువులు తెగిపోకుండా ఇంజనీరింగ్, వ్యవసాయ శాఖలు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వాహనాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.
శాఖల సమన్వయంతో తక్షణ స్పందన బృందాలు
పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, మెడికల్ అండ్ హెల్త్, విద్యుత్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తుఫాను కారణంగా సంభవించే నష్టాలకు తక్షణమే స్పందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
తుఫాను సమాచారాన్ని వెంటనే తెలియజేయాలి
డివిజన్, మండల అధికారులు తుఫాను ప్రభావం, నష్టం వివరాలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌కి అందజేయాలని ఆదేశించారు. ఎటువంటి పెద్ద సంఘటన సంభవించినా వెంటనే ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి, అనంతరం రాతపూర్వక నివేదిక పంపాలని సూచించారు.
సమీక్షలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
