డైనమిక్ న్యూస్ ,నల్గొండ జిల్లా, అక్టోబర్ 28
నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరు – సోమసముద్రం చెరువు వద్ద ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి భారీ వర్షాలు, వరదనీటి ఉధృతికి ఈ నెల 9న కూలిపోయింది. దీని ఫలితంగా హాలియా నుంచి పేరూరు, చిలకాపురం, కొరివేణిగూడెం, వీర్లగడ్డ తండా, పుల్లారెడ్డిగూడెం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు
బ్రిడ్జి ధ్వంసం కావడంతో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల నిమిత్తం హాలియా మండల కేంద్రానికి రావాలంటే చెరువు అలుగు నీటిలోంచి నడిచి రావాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల ఓ వ్యక్తి అలుగు దాటుతుండగా నీటి ఉధృతిలో కొట్టుకుపోయినా, అదృష్టవశాత్తూ స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి అతడిని కాపాడారు.
ప్రజల ఆగ్రహం ఉధృతం
బ్రిడ్జి కూలిన 15 రోజులు గడిచినా ఇప్పటివరకు అధికారులు ఎటువంటి తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోవడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. “సారు మా ఊరు బ్రిడ్జిని పట్టించుకోండి” అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంఎల్ఏ, కలెక్టర్ పరిశీలన – చర్యలేమి
కూలిన మరుసటి రోజు, అంటే అక్టోబర్ 10న నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తాత్కాలిక వంతెన నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించినప్పటికీ, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


“రాకపోకలు పునరుద్ధరించాలి” – ప్రజల విజ్ఞప్తి
గ్రామాల మధ్య రవాణా నిలిచిపోవడంతో పాఠశాలలు, వ్యాపారాలు, వ్యవసాయ పనులు దెబ్బతిన్నాయి. తక్షణమే తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసి రాకపోకలు సులభం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
