నిజామాబాద్ ,డైనమిక్ , అక్టోబర్ 27
శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ కొత్త అడుగులు వేస్తోంది. మాజీ ఖైదీలకు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసింది.
నిజామాబాద్ మల్లారంలో కొత్త పెట్రోల్ బంక్ ప్రారంభం
సోమవారం నిజామాబాద్ జిల్లా మల్లారం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
“అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” – డీజీ సౌమ్య మిశ్రా
ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, “శిక్ష అనుభవించిన తర్వాత విడుదలైన ఖైదీలు తిరిగి నేర మార్గంలోకి వెళ్లకుండా, సమాజంలో ఆదర్శంగా నిలవాలి. వారికి ఇవ్వబడుతున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు.
మహిళా ఖైదీలకు కుట్టుమిషన్లు – పురుషులకు పెట్రోల్ బంకులు ఖైదీల పునరావాసం కోసం జైళ్ల శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. పురుష ఖైదీలకు పెట్రోల్ బంకులు, మహిళా ఖైదీలకు కుట్టుమిషన్లు, చిన్న స్థాయి వ్యాపారాలు వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
“సమాజంలో సానుకూల మార్పుకు ఇది దారితీస్తుంది”
ఖైదీలు తిరిగి సాధారణ జీవితంలో అడుగుపెట్టేందుకు ఈ కార్యక్రమాలు సహాయపడతాయని, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని డీజీ సౌమ్య మిశ్రా అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో మాజీ ఖైదీల జీవితాల్లో కొత్త వెలుగు ప్రసరిస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.
