Monday, March 2, 2026
Homeతాజా సమాచారంకాంగ్రెస్ పాలన అవినీతి కంపుతోఊపిరాడనివ్వట్లేదు: కేటీఆర్ తెలంగాణ భవన్‌లో బీజేపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు –...

కాంగ్రెస్ పాలన అవినీతి కంపుతోఊపిరాడనివ్వట్లేదు: కేటీఆర్ తెలంగాణ భవన్‌లో బీజేపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – గన్ కల్చర్, మాఫియా రాజ్యంగా మారిన రాష్ట్రం – బలహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం

డైనమిక్ డెస్క్,హైదరాబాద్‌, అక్టోబర్‌ 23


తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన అవినీతి, అరాచకాలు, గన్ కల్చర్‌తో ప్రజలకు ఊపిరాడనివ్వడంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రం మొత్తం అవినీతి దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రజల భద్రత, పరిపాలన అన్నీ కాంగ్రెస్ నేతల వాటాల పంచాయతీగా మారిపోయాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి – బలహీన ముఖ్యమంత్రి’

రాజకీయ జీవితంలో ఇంత బలహీన ముఖ్యమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
“ఒక మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపించేంత స్థాయిలో ముఖ్యమంత్రి దిగజారాడు. నిందితులను మంత్రులు తమ కార్లలో తీసుకెళ్తే కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. స్వయంగా మంత్రులే ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తే కూడా స్పందించలేని బలహీన నాయకుడు రేవంత్ రెడ్డి’’ అని ఎద్దేవా చేశారు.“ముఖ్యమంత్రి అనుచరుడు రోహిన్ రెడ్డి పేరుతోనే గన్ను బెదిరింపులు జరిగాయి. మంత్రి కూతురు కూడా గన్ కల్చర్‌పై ఆరోపణలు చేస్తే కూడా సిగ్గు లేకుండా మౌనంగా ఉన్నారు. పాలనపై పట్టు కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు భారమయ్యాడు’’ అని కేటీఆర్ అన్నారు.

‘దండుపాళ్యం ముఠా పాలనలో రాష్ట్రం’

కేటీఆర్ దూసుకెళ్లుతూ, “ఇది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాదు దండుపాళ్యం ముఠా నడిపిస్తున్న మాఫియా రాజ్యం. ముఖ్యమంత్రి, మంత్రులు గనులు, టెండర్లలో వాటాల పంచాయతీతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారు’’ అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.“మంచి అధికారులు కూడా వీరి ఒత్తిడికి భయపడి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకుంటున్నారు. రిజ్వీ లాంటి అధికారుల రాజీనామా కూడా అడ్డుకునేంతగా ఒత్తిడి పెడుతున్నారు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం కొనసాగుతోంది’’ అని కేటీఆర్ విమర్శించారు.

‘గన్ను పెట్టి బెదిరింపులు.. మాఫియా రాజ్యం తెలంగాణలో’

రాష్ట్రంలో గన్ను కల్చర్ నడుస్తున్నదని, వ్యాపారవేత్తల తలపై తుపాకీలు పెట్టి బెదిరిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తెచ్చింది రోహిన్ రెడ్డి అని మంత్రి కూతురు స్వయంగా చెప్తుంది. కానీ పోలీసులు మాత్రం కేసు మళ్లించేందుకు ఇతర పేర్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నాడు?” అని ప్రశ్నించారు.

‘డీజీపీ కాకీ బుక్‌ అన్నాడు – కానీ చేతల్లో కాంగ్రెస్ బుక్‌!’

కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ, “రాష్ట్ర డీజీపీకి కాకీ బుక్ మాత్రమే ఉందని చెప్పుకునే ధైర్యం ఉంది, కానీ చేతల్లో మాత్రం కాంగ్రెస్ బుక్ ఉంది. నిజాయితీ ఉంటే గన్ను బెదిరింపు వ్యవహారంపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈ కేసులో మంత్రి కూతురు చెప్పిన పేర్లన్నింటిని విచారించాలి’’ అన్నారు. “ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఈ వ్యవహారంలో వినిపిస్తోంది. ఆయనను విచారణకు పిలవాలి. సుమంత్‌, రోహిన్ రెడ్డిలను విచారించకపోవడం అన్యాయం’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

‘కాంగ్రెస్ ఇంటిపంచాయతీగా మారిన టెండర్లు’

“రాష్ట్రంలో టెండర్లు, కాంట్రాక్టులు, కమిషన్ల వ్యవహారాలు మొత్తం కాంగ్రెస్ నేతల కుటుంబ పంచాయతీగా మారిపోయాయి. పొంగులేటి టెండర్లలో జోక్యం చేసుకున్నారని మంత్రి కూతురు స్వయంగా ఒప్పుకుంది’’ అని కేటీఆర్ ఆరోపించారు.ముఖ్యమంత్రి ఇల్లు ఇప్పుడు సెటిల్‌మెంట్‌లకు కేంద్రంగా మారింది. ఏ టెండర్‌లో ఎవరికి ఎంత వాటా అన్నది అక్కడే నిర్ణయమవుతోంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది మాఫియా సిస్టమ్’’ అని కేటీఆర్ విమర్శించారు.

బీజేపీ – కాంగ్రెస్ జాయింట్ వెంచర్ పరిపాలన’

కేటీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణలో కాంగ్రెస్ అవినీతి, బెదిరింపులపై బీజేపీ నోరు మూసుకుంది. ఇది స్పష్టంగా రెండు పార్టీల మధ్య జాయింట్ వెంచర్ పరిపాలన. కేంద్రంలోని ఏజెన్సీలు కూడా మౌనం వహిస్తున్నాయి. అందుకే తెలంగాణను కాపాడడంలో బీజేపీ విఫలమైంది’’ అన్నారు.

‘మల్లికార్జున ఖర్గే నిజం చెప్పారు’

కేటీఆర్ చివరగా మాట్లాడుతూ, “ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారే చెప్పారు – ఇంత అవినీతి, అరాచక పాలన ఆయన జీవితంలో ఎప్పుడూ చూడలేదని. అది తెలంగాణ ప్రజల అభిప్రాయం. అందుకే ఈ పాలనకు ప్రజలు విసుగెత్తిపోయారు’’ అని అన్నారు.

‘మాఫియా రాజ్యాన్ని తరిమి తెలంగాణను రక్షించాలి’

“దావూద్ ఇబ్రహీం తరహాలో వ్యవహరిస్తున్న ఈ ముఖ్యమంత్రిని పదవి నుంచి తరిమేస్తేనే తెలంగాణలోని శని తీరుతుంది. అధికారులు, ప్రజలు ఇక మౌనంగా ఉండకూడదు. అవినీతి పట్ల ప్రతిఘటన మొదలుపెట్టాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments