టేక్మాల్, ఏప్రిల్ 19 ,శుభోదయం డైనమిక్
చట్టాలు కఠినంగా అమల్లో ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో అక్రమ ఇటుక బట్టీలు విస్తరిస్తూ పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. టేక్మాల్, సర్మన్కుంట తాండ గ్రామ పంచాయతీల శివారులో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటుక బట్టీలు యథేచ్ఛగా నడుస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు – అనుమతుల్లేకే బట్టీలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటుక బట్టీల స్థాపనకు పర్యావరణ, పంచాయతీరాజ్, మైనింగ్, రెవెన్యూ, అటవీ, విద్యుత్ శాఖల అనుమతులు తప్పనిసరి. అయితే టేక్మాల్ పరిసరాల్లో నడుస్తున్న బట్టీలకు ఇలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా భూగర్భ జలాల సంరక్షణ కోసం ఉన్న వాల్టా చట్టాన్ని నిర్వాహకులు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
వ్యవసాయ భూములపై ముప్పు
సారవంతమైన వ్యవసాయ భూముల్లో భారీ గుంతలు తవ్వి మట్టిని తరలించడం వల్ల భవిష్యత్తులో సాగుకు భూములు అనర్హంగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశముంది.
పిల్లల ఆరోగ్యంతో చెలగాటం
ఇటుక బట్టీల నుండి వెలువడే దట్టమైన పొగ సమీపంలోని ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ గిరిజన ఆశ్రమ పాఠశాల వైపు వ్యాపిస్తోంది. దీంతో విద్యార్థులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. బాటసారులు, వాహనదారులు కూడా పొగ, ధూళి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యం?
పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడం పట్ల గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం వెనుక కారణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి – స్థానికుల డిమాండ్
విద్యాసంస్థల సమీపంలో ఇటుక బట్టీలను కొనసాగించడం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి అక్రమ బట్టీలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

