సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 26
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా, భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
జీవో 76తో అఫిడవిట్ నిబంధన సడలింపు
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జీవో 76ను జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఇకపై సాదా బైనామా ప్రక్రియలో కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకునేలా నిబంధనలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.
పట్టా భూములకే ప్రాసెస్ – 5 ఎకరాల లోపువారికి ప్రాధాన్యం
భూమి విక్రయం సమయంలో అమ్మకందారు రికార్డుల్లో నమోదు ఉండాలని, పట్టా భూములకే ప్రాసెస్ చేయాలని సూచించారు. అలాగే భూమిపై పొజిషన్ ఉన్న 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారికి మాత్రమే దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.
నోటీసుల తర్వాత 30 రోజుల్లో పరిష్కారం
నోటీసులు జారీ చేసిన తర్వాత 30 రోజులు పూర్తయిన కేసులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పంచనామా నిర్వహించాలని సూచించారు.
చాలన్ ముందు రెండుసార్లు తనిఖీ
చాలన్ చెల్లించే ముందు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి సరిచేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారికి 13(B) పట్టాలను వేగంగా జారీ చేయాలని చెప్పారు.
భూభారతి దరఖాస్తులు 15 రోజుల్లో క్లియర్ చేయాలి
భూభారతి పెండింగ్ దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాలని, కోర్టు కేసులు మరియు హైకోర్టు కేసులకు సమయానికి జవాబులు ఇవ్వాలని సూచించారు.
స్లాట్ క్యాన్సిలేషన్ – రీపేమెంట్‌పై చర్యలు
స్లాట్ బుకింగ్‌ను రద్దు చేసుకున్న వారికి రీపేమెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు ఆదేశించారు.
ఎన్నికల డేటా పనులు వేగవంతం
ఎలక్షన్ మ్యాపింగ్ ఎంట్రీలను త్వరగా పూర్తి చేయాలని, ఫారం-6, 7, 8 పెండింగ్ లేకుండా చూడాలని చెప్పారు. అలాగే మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్నారు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయిగౌడ్, శ్రీలత, సంతోష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
