సూర్యాపేట బ్యూరో, మార్చి 26, డైనమిక్ న్యూస్
సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని దురాజుపల్లి గ్రామంలోని ఎం.ఎస్.ఆర్ సెంట్రల్ స్కూల్‌లో గురువారం ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఉన్నత లక్ష్యాలు ఎంచుకుంటేనే విజయం
విద్యార్థులు ఉజ్వలమైన, ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే మంచి విజయాలు సాధించవచ్చని ఎస్పీ తెలిపారు. పాఠశాలలను దేవాలయాలుగా, తరగతి గదులను ప్రయోగశాలలుగా భావించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెంపొందించుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్–అలైవ్’ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. మానవ తప్పిదాల వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ప్రయాణిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు.
హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగించడం తప్పనిసరి అని, అతివేగం ప్రాణాంతకమని హెచ్చరించారు. చిన్నారులు వాహనాలు నడపడం నేరమని స్పష్టం చేశారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్, వాకింగ్ పాటించాలి
రోడ్డు పై ప్రయాణించే సమయంలో చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ డిఫెన్సివ్ డ్రైవింగ్, డిఫెన్సివ్ వాకింగ్ పాటించాలని సూచించారు. రోడ్డు దాటేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
ప్రస్తుతం యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోందని, ఇది భవిష్యత్తును నాశనం చేస్తుందని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌పై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం
సాంకేతికత అభివృద్ధితో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, అపరిచితుల మాటలకు లోబడకూడదని సూచించారు. వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వకూడదని, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా సందేశాలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగితే మోసమని గుర్తించాలని తెలిపారు.
పోలీస్ కళా బృందం ప్రదర్శనలు
ఈ కార్యక్రమంలో షీ టీమ్స్, పోలీస్ కళా బృందం విద్యార్థులకు భద్రత, సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, షీ టీం ఎస్సై నీలిమ, ఎంఎస్‌ఆర్ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.“తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు వారి ఆశయాలను నెరవేర్చే దిశగా విద్యార్థులు కృషి చేయాలి” అని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు.

