డైనమిక్ న్యూస్, హుజూర్ నగర్, మార్చి 23
వ్యాపార లాభార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న అక్రమ మిఠాయి కర్మాగారంపై చర్యలు తీసుకోవాలని 16వ వార్డు ప్రజలు కోరుతున్నారు.
బజారులో అక్రమంగా మిఠాయి కర్మాగారం
స్థానిక పీర్ల కొట్టం బజారులో పెండ్యాల కోటేశ్వరరావు మిల్లులో కూల్‌డ్రింక్స్ ఏజెన్సీ కోసం గోదాం కిరాయికి తీసుకున్న యజమాని, ఇటీవల అదే ప్రదేశంలో మిఠాయి కర్మాగారం ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు.
పొగ వాసనలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
మిఠాయి తయారీ సమయంలో వెలువడుతున్న పొగ మరియు దుర్వాసనల వల్ల బజారు పరిసర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సమీపంలోని అంగన్వాడి పిల్లలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదులు చేసినా స్పందన లేదు
ఈ సమస్యపై గతంలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ కర్మాగారం నిర్విరామంగా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్‌కు వినతి
కాలనీ వాసుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సామాజిక కార్యకర్తలు ఆకుల రాము, బత్తిని వీరప్రసాద్ కలిసి మున్సిపల్ కమిషనర్‌కు సమర్పించారు. వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి కర్మాగారం నిలిపివేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
చర్యలు లేకపోతే ఉన్నతాధికారులను ఆశ్రయం
సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్, జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు మరియు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులను కలవనున్నట్లు వారు హెచ్చరించారు.
