డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మార్చి 14
హుజూర్‌నగర్ పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన రాజీవ్ నగర్ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై వివాదం చెలరేగింది. మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఇళ్లకు సంబంధించి అధికారులు శనివారం విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాపై స్థానిక దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లబ్ధిదారుల ఆగ్రహం
జాబితాలో అనర్హులకు ప్రాధాన్యం కల్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంతంగా భూములు, ప్లాట్లు ఉన్నవారికి కూడా ఇళ్లు కేటాయించారని ప్రచారం జరుగుతుండగా, నిజంగా ఇళ్లు లేని నిరుపేదలను పట్టించుకోలేదని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సరైన విధంగా జరగలేదని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అనర్హులను ఎంపిక చేశారని వారు ఆరోపిస్తున్నారు.
పునఃసమీక్ష చేయాలన్న డిమాండ్
ఈ వివాదంపై ఉన్నతాధికారులు స్పందించి జాబితాను పునఃసమీక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజమైన అర్హులను గుర్తించి న్యాయం చేయాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో మళ్లీ విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
దరఖాస్తుదారుల వేడుకోలు
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి, అసలు నిలువ నీడ లేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరిపించాలని వారు కోరుతున్నారు.
